komatireddy venkat reddy కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన సోనియాకు వివరించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఇటీవల జరుగుతోన్న కోల్డ్ వార్ నేపథ్యంలో.. అధినేత్రి అపాయింట్‌మెంట్ కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు జరుగుతున్న అవమానాల గురించి దిల్లీలోనే తేల్చుకుంటానని వెంకట్రెడ్డి బహిరంగాగానే చెప్పిన సంగతి తెలిసిందే.
పార్టీలో తాజా పరిణామాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు సోనియాగాంధీతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలను కలువనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ల వైఖరిని తప్పుబడుతున్న వెంకటరెడ్డి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇస్తానని తెలిపారు. పార్టీలో చేరికలు, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తి గురించి వివరించనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సైతం సోనియాతో భేటీ అయ్యే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అధిష్ఠానానికి తెలియనీయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న మర్రి.. తమ ఆవేదనను సోనియాకు వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోనియాగాంధీని, రాహుల్ గాంధీలను కలిసి వివరించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది.