ఏకంగా ఉస్మానియా ఆస్పత్రిలోకి నీరొచ్చిందంటే రాష్ట్రంలో పాలన గాడితప్పిందని స్పష్టమవుతోందని ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సీఎంగా అనర్హుడు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - రాష్ట్రంలో పాలన గాడితప్పిందన్న ఎంపీ కోమటరెడ్డి
ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందని ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఓవైపు రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా సీఎం సమీక్షించడంలేదన్నారు. మరోవైపు సచివాలయంపై సమీక్ష నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను నివేదిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష జరిపి నివారణ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో సచివాలయంపై సమీక్ష నిర్వహించడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. కోట్ల వ్యయంతో ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా అన్నారు. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడలేని కేసీఆర్, ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :ఉస్మానియా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బండి సంజయ్ మద్దతు