MP Keshava Rao Speech in Parliament Special Sessions : 40 శాతం దేశ సంపద ఒక్క శాతం జనాభా చేతుల్లోనే ఉందని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు(Keshava Rao) అన్నారు. ఒక పార్టీనే కాకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందాలని తెలిపారు. దిల్లీలో జరుగుతోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు మాట్లాడారు.భారతదేశ జనాభా ఎంతో వైవిధ్య భరితమైందని.. మొదటి నుంచి లౌకికవాదానికి(Secularism) ప్రాధాన్యత ఇస్తోందని కేశవరావు చెప్పారు. హిందూ పదం ఆరో శతాబ్దం తర్వాత వచ్చిందని వివరించారు. రాజ్యాంగ ప్రవేశికలోనూ లౌకికవాదం గురించి చెప్పారని గుర్తు చేశారు. ధనిక, పేద తారతమ్యాలపై సభలో చర్చించాలని కోరారు. ఈ సువిశాల భారతదేశంలో సుమారు 3 వేలకు పైగా జాతులు ఉన్నాయన్నారు.
అంతకు ముందు అఖిలపక్ష సమావేశం తర్వాత బీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాసేపు చర్చించారు. అనంతరం మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టాలని.. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ పోరాడితే మేం మద్దతు ఇస్తాం: కవిత
ఏపీ విభజన సరైన క్రమంలో జరగలేదు : ఆంధ్రప్రదేశ్ విభజన సరైన క్రమంలో జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసంతో జరిగిందన్నారు. రాష్ట్ర విభజన ఇరవర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని తెలిపారు. కొత్త రాష్ట్రం వచ్చిన తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని అన్నారు.