Avinash Reddy CBI Inquiry: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కాల్ డేటా నుంచి హత్య విషయంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీసింది. హైదరాబాద్ కోఠిలోని కేంద్రీయ సదన్‌లో ఉన్న సీబీఐ కార్యాలయంలో దిల్లీ నుంచి వచ్చిన బృందం ఆయనను శనివారం నాలుగున్నర గంటలకుపైగా విచారించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కార్యాలయం లోపలికి వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. దిల్లీ సీబీఐ ఎస్‌సీ-3 విభాగం ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని బృందం అవినాష్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. వీడియో తీయాలని.. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. అందుకు సీబీఐ నిరాకరించడంతో ఆయన ఒంటరిగానే కార్యాలయంలోనికి వెళ్లారు.
బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. విచారణకు సంబంధించిన విషయాలను ఇప్పుడు బహిర్గతం చేయలేనని చెప్పారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించడానికి ముందు నాడు వివేకా హత్య జరిగిన సమయంలో దర్యాప్తు చేసిన కడప పోలీసులను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వైయస్‌ఆర్ జిల్లా నుంచి అవినాష్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఆయన వెంట వచ్చారు. తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బృందం విచారణ ముగిసేవరకు ఇక్కడే ఉంది. అవినాష్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో పేర్కొన్నారు. విచారణ అనంతరం మరోసారి రావాలని అవినాష్‌రెడ్డికి సీబీఐ సూచించింది.
248 మంది వాంగ్మూలాల ఆధారంగా విచారణ:2019 మార్చిలో వైఎస్ వివేకానంద హత్య జరిగింది. తొలుత గుండెపోటు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు మిన్నంటాయి. దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతోంది. పలు విడతలుగా సీబీఐ దర్యాప్తు బృందాలు కడప జిల్లాకు వెళ్లి క్షేత్ర స్థాయిలో సాక్ష్యాధారాల్ని సేకరించాయి. 248 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించాయి. ఈ కేసులో అవినాష్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమైనా ఇప్పటివరకు దృష్టి సారించలేదు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే ఆయనను విచారించే యోచనలో సీబీఐ అధికారులున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.