Celebrities Participated in Bhogi Celebrations : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు నిర్వహించుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి పండగను ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. భోగి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద చేరి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు మరవకుండా పండగలను నిర్వహించుకోవాలని వారు తెలిపారు.
ఏ స్థాయిలో ఉన్న పండుగలను కలసికట్టుగా జరుపుకోవాలి: భోగి వేడుకలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. నెల్లూరులోని ఆయన స్వగృహంలో నిర్వహించిన ఈ వేడుకలలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఏ స్థాయిలో ఉన్న పండుగలను కలసికట్టుగా జరుపుకోవాలని వెంకయ్యనాయుడు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆయన సందడి చేశారు.
రాష్ట్రంలో మంచి నాయకత్వం రావాలి:తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకలలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం రావాలని.. రాష్ట్రంలోని ప్రజలు బాగుపడాలని ఆయన ఆకాంక్షించారు.
వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగినది.. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ. నా ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని కోరుకుంటున్నా. -బాలకృష్ణ, సినీనటుడు, ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు హాజరయ్యారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు మరచిపోకుండా పండగలను నిర్వహించుకోవాలని తెలిపారు. బంధువులు, స్నేహితులతో కలిసి పండుగలు నిర్వహించుకుంటే ఎనలేని అనభూతి కలుగుతుందని అన్నారు.