తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి-విస్తరణపై చర్చ జరిగింది. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు. ‘తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు నడవక అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. అప్పుడే చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలు కష్టాల నుంచి బయటపడతాయి’.