THARAKARATNA HEALTH UPDATES: బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత ఏడు రోజులుగా తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ.. తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లలను సంప్రదిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేశారు. స్కాన్ రిపోర్టర్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో గత నెల 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కొద్ది దూరం నడిచిన అనంతరం గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హూటాహూటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి గత ఏడు రోజులుగా చికిత్సను అందిస్తున్నారు.