టాక్సీబైక్ ముసుగులో ప్రజారవాణా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోటికి పైగా జనాభా నివసిస్తుండగా అరకోటికి పైగా వాహనాలున్నాయి. కరోనాకు ముందు సుమారు 2 లక్షల 30 వేల వరకు ఆటోలు, లక్షా 20 వేల క్యాబ్‌లు ఉన్నాయి. కరోనా అనంతరం పరిస్థితులతో ఆటోలకు డిమాండ్ తగ్గకపోయినా.. క్యాబ్‌లకు మాత్రం తగ్గిపోయింది. దీంతో క్యాబ్‌ల సంఖ్య సగానికి సగం అంటే.. సుమారు 60వేలకు పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రజారవాణాలోకి ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
ఓలా, ఊబర్, రాపిడో సంస్థలు ప్రజారవాణాలో ద్విచక్రవాహనాలను నడిపిస్తున్నాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ప్రజారవాణాకు వినియోగించే ఏ వాహనమైన రవాణాశాఖ అనుమతి కచ్చితంగా పొంది పసుపు నంబర్ ప్లేట్‌తో రవాణా సాగించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఇలాంటి నిబంధనలు పాటించడంలేదు. చాలా మంది తమ సొంత వాహనాలను ప్రజారవాణాలో వినియోగిస్తున్నారు. ఈ కారణంగా రవాణాశాఖకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.
ఓలా, ఊబర్, రాపిడో సంస్థలకు చెందిన ట్యాక్సీబైక్‌లు 50వేల వరకు ఉంటాయని అంచనా. వీటిని ఆయా సంస్థలు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజారవాణా చేసేందుకు అనుమతి ఇస్తుంటాయి. రవాణాశాఖ అధికారుల గణాంకాల ప్రకారం గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 9వేల 383 ద్విచక్రవాహనాలు మాత్రమే ప్రజారవాణా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఎల్లో నంబర్ ప్లేట్ వినియోగిస్తున్నారు. వీటి నుంచి రవాణాశాఖ పన్నులను వసూలు చేస్తోంది.
మిగితావి మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే తెల్లనంబర్ ప్లేట్‌తోనే దర్జాగా నడుపుకుంటున్నారు. ఈ వాహనాల నుంచి రవాణాశాఖకు ఎలాంటి ట్యాక్స్ రావడంలేదు. ఈ కారణంగా భారీగా ఆదాయం కోల్పోవల్సి వస్తుందని రవాణారంగ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. ఈ ట్యాక్సీబైక్‌ల ముసుగుతో పెద్దఎత్తున సాగుతున్న రవాణాతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆటో, క్యాబ్‌వాలాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఎలాంటి పన్నులు చెల్లించకుండానే యథేచ్ఛగా బైక్‌లు తిరుగుతుండటంతో.. అన్ని అనుమతులతో ట్యాక్సీలు చెల్లిస్తూ తాము నష్టాల్లో కూరుకుపోతున్నట్లు వాపోతున్నారు. వీరిపై నియంత్రణ కొరవడటంతో తమకూ, ప్రభుత్వానికి నష్టం చేకూర్చటమే కాకుండా ప్రజల భద్రతకు సైతం ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ట్యాక్సీబైక్‌ల ముసుగులో అనుమతులు లేకుండా ప్రజారవాణా సాగిస్తున్న వారిని కట్టడి చేయాలని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి చర్యల పట్ల కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.
"ఎలాంటి పన్నులు చెల్లించకుండానే యథేచ్ఛగా టాక్సీ బైక్‌లు తిరుగుతుండటంతో.. అన్ని అనుమతులతో ట్యాక్సీలు చెల్లిస్తూ మేము నష్టాల్లో కూరుకుపోతున్నాం. వారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీని వలన ప్రభుత్వానికి నష్టం ఏర్పాడుతోంది. అంతే కాకుండా ప్రజల భద్రతకు ముప్పు ఉంది". షేక్ సలావుద్దీన్, ఛైర్మన్, టాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ
ఇవీ చదవండి: