తెలంగాణ

telangana

ETV Bharat / state

Motkupalli Narasimhulu: నేడు కేసీఆర్​ సమక్షంలో కారెక్కనున్న మాజీ మంత్రి మోత్కుపల్లి - తెలంగాణ తాజా వార్తలు

మాజీ మంత్రి, సీనియర్​ నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తెరాసలో చేరనున్నారు. తెలంగాణ భవన్​లో కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ చేరిక అంశంపై ఆదివారం.. కేసీఆర్​తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. మోత్కుపల్లి.

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu

By

Published : Oct 18, 2021, 9:58 AM IST

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నేడు కారెక్కనున్నారు. గులాబీ దళపతి కేసీఆర్​ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆదివారం.. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. హైదరాబాద్​లోని అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు, గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి తెలంగాణ భవన్‌ చేరుకొని సీఎం కేసీఆర్‌ సమక్షంలో నేడు తెరాస గూటికి చేరనున్నారు.

సుదీర్ఘకాలం తెదేపాలో అనేక కీలక పదవులు అనుభవించిన మోత్కుపల్లి.. ఆ పార్టీని వీడి.. భాజపాలో చేరారు. అక్కడికి కొద్దిరోజుల్లోనే కమలం పార్టీకీ గుడ్​బై చెప్పారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా భాజపాలో సముచిత స్థానం కల్పించలేదని.. రాజీనామా సమయంలో మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.

దళిత బంధుపై సన్నాహక సమావేశం అనంతరం కేసీఆర్​పై ప్రశంసల వర్షం కురిపించిన మోత్కుపల్లి.. దేశంలోనే దళితులకు పది లక్షలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు. దళిత నేతలంతా కేసీఆర్‌కు మద్దతు తెలపాలని మోత్కుపల్లి నర్సింహులు గతంలో కోరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మోత్కుపల్లి కారెక్కుతారని ప్రచారం జరిగింది. ఇటీవల శాసనసభలోనూ దళితబంధుపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటే ఉన్నారు.

ఇదీచూడండి:Motkupalli: 'కేసీఆర్​ మొనగాడు.. దళిత బంధు పథకాన్ని అందరూ స్వాగతించాలి'

ABOUT THE AUTHOR

...view details