తెలంగాణ

telangana

ETV Bharat / state

mothers day special: అమ్మ... ఎవరికైనా అమ్మే కదా..! - మదర్స్​ డే స్టోరీస్

mothers day special: అప్పటివరకూ సాఫీగా సాగిపోతున్న సంసారం. అమ్మానాన్నా పిల్లలూ... ఆనందానికి చిరునామా అన్నట్లున్న ఇల్లు. అనుకోకుండా జరిగిన ఒక్క సంఘటన ఆ ఆనందాన్ని ఎత్తుకుపోతే... తల్లడిల్లిన తల్లి మనసు ఊరుకోలేదు.  సమాజాన్ని నిలదీసింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనాథల్ని అక్కున చేర్చుకుంది. తోటివారికి స్ఫూర్తినిచ్చింది. ఇవన్నీ చేయడానికి వయసు అసలు అడ్డంకే కాదని నిరూపించింది. రండి... అమ్మ ఎవరికైనా అమ్మేననీ ఆమె మనసులో మొత్తంగా సమాజానికి చోటుందనీ నిరూపించిన ఈ మాతృమూర్తులను పరిచయం చేసుకుందాం!

mothers day 2022 special
మదర్స్ డే 2022

By

Published : May 8, 2022, 6:54 AM IST

mothers day special: పదిహేనేళ్ల కొడుకు తన ఎత్తై వెనకాలే తిరుగుతూ పనుల్లో సాయం చేస్తోంటే ఆ తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుండేది. అలాంటిది హఠాత్తుగా ఆ పిల్లవాడు జబ్బుపడితే ఆమెకు కాళ్లూ చేతులూ ఆడలేదు. గబుక్కున డాక్టరు దగ్గరకు తీసుకెళ్లడానికి ఆమె ఉన్నది పట్టణంలో కాదు, అసోంలోని మారుమూల గిరిజన గూడెంలో. ఎవరికే ఇబ్బంది వచ్చినా అక్కడి వాళ్లు వెళ్లేది భూతవైద్యుల దగ్గరకే. బిరుబాలా కూడా అలాగే వెళ్లింది. అతడు పిల్లవాడికి దయ్యం పట్టిందనీ, మూడు రోజుల్లో చనిపోతాడనీ చెప్పాడు. అది విన్న ఆ తల్లి గుండెలు జారిపోయాయి. ఇక ఆ తర్వాత మూడు రోజులూ ఇంట్లో వాళ్లంతా ఆ పిల్లవాణ్ణి పట్టుకుని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. నాలుగో రోజు తెల్లారింది. పిల్లవాడు మామూలుగానే ఉన్నాడు. అది చూసి గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంది తల్లి. పరామర్శించడానికి వచ్చిన ఊళ్లోవాళ్లు ‘నువ్వు అదృష్టవంతురాలివి, దయ్యం మీ అబ్బాయిని వదిలేసింది. పక్క వీధిలో అయితే పాతికేళ్ల మనిషిని పట్టుకుపోయింది. పొరుగూళ్లో ఉన్న మంత్రగత్తెలే ఇలా దయ్యాలను వదులుతున్నారు’ అంటూ ఏవేవో చెప్పేవారు.

ప్రత్యేక చట్టం చేయించింది!: బిరుబాలా కూడా ఒకప్పుడు అలాగే నమ్మేది. కానీ కొడుకు విషయం కళ్లారా చూశాక ఆమెకి భూతవైద్యుల్ని నమ్మాలనిపించలేదు. దాంతో తన ఊరిలోనూ చుట్టుపక్కల పల్లెల్లోనూ జరుగుతున్న విషయాలపై దృష్టిపెట్టింది. పిల్లలకైతే దయ్యం పట్టిందని పూజలకు డబ్బు గుంజే ఆ భూతవైద్యులు మహిళలపైనేమో మంత్రగత్తెలన్న ముద్రవేసేవారు. ఊళ్లో ఎవరికి అనారోగ్యంగా ఉన్నా, పంటలు పండకపోయినా... వాళ్లే కారణమనేవారు. ఊరి ప్రజలు వాళ్ల మాట నమ్మి మహిళలపై దౌర్జన్యానికి దిగి ఊరినుంచి వెలివేసేవారు. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళలు ఏ నదిలోనో దూకి చావడం... అక్కడ మామూలే. ఈ పరిణామాల్ని ఊహించి భార్యకు మంత్రగత్తె అన్న పేరు రాగానే భర్త ఊరొదిలి పారిపోయేవాడు. వారి పిల్లలు అనాథలై రోడ్డునపడితే వారి పొలాలనేమో ఇతరులు ఆక్రమించుకునేవారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మూఢనమ్మకాల్ని అడ్డంపెట్టుకుని భూతవైద్యం మాటున చేస్తున్న ఈ అకృత్యాలన్నీ తెలిసేసరికి బిరుబాలాకి చాలా కోపం వచ్చింది. వారి ఆటలు ఇక సాగనివ్వకూడదనుకుంది. వాళ్లు చెప్పింది పలుమార్లు తప్పవడాన్ని ఎత్తి చూపిస్తూ మెల్లగా ఊరివారిలో ఆలోచన రేకెత్తించింది. ఎంత మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారో, ఎంత మంది పిల్లలు బస్టాండుల్లో అడుక్కుంటున్నారో వాళ్లచేతే లెక్కలు తీయించింది. రేపు ఆ స్థానంలో మనమూ ఉండవచ్చని చెప్పింది. దయ్యాలూ భూతాలూ ఉండవనీ ఆరోగ్యం బాగోకపోతే పట్టణంలోని ఆస్పత్రికి వెళ్దామనీ చెప్పింది. కాలినడకన తనే చుట్టుపక్కల ఊళ్లకూ వెళ్లి మహిళలను సమావేశపరిచి జరుగుతున్న మోసం గురించి వివరించి చెప్పేది. దయ్యాల పేరుతో ఆ అమాయకులను దోచుకోవడానికి అలవాటు పడినవారికి బిరుబాలా వ్యవహారం కంటగింపైంది. ఆమె అడ్డు తప్పించుకోడానికి పలుమార్లు హత్యాయత్నాలు చేశారు. ఆమె దేనికీ వెరవలేదు. నిజానికి ఈ సమస్య అసోంలోని గిరిజన ప్రాంతాలన్నిట్లో ఉంది. ఏటా కొన్ని వందలమంది మహిళలు మంత్రగత్తెల పేరుతో దాడులకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే బిరుబాలా చేస్తున్న పోరాటం ప్రజల్లో మార్పు తేవడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్నీ కదిలించింది. మహిళలపై మంత్రగత్తెలన్న ముద్ర వేసినవారికి జైలు శిక్ష పడేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.

ఆరు పదుల వయసులో అనాథలకు అమ్మై...:‘నువ్వు నాకు అమ్మవి కాదు, ముసలమ్మవి. అమ్మంటే నా ఫ్రెండ్‌ వాళ్లమ్మలాగా ఉండాలి. మా అమ్మ ఏదీ...’ ఆరేళ్ల మోహిని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ప్రభావతీ ముథాల్‌ని రోజుకోసారైనా ఆ ప్రశ్న వేసేది. ఆమె నవ్వుతూ ‘నీకు అమ్మనీ నేనే అమ్మమ్మనీ నేనే’ అంటూ ఆ అమ్మాయిని గట్టిగా గుండెలకు హత్తుకుని కథలు చెబుతూ మరిపించేవారు. రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి మరీఆ పిల్లని దత్తత తీసుకున్నారామె. ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఒక మామూలు మహిళని పోరుబాట పట్టించి ఎందరో అనాథలకు అమ్మని చేసింది చిన్నారి మోహినీనే.

ప్రభావతి కుమారుడు మహారాష్ట్రలోని చంద్రపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యుడు. ఓసారి ఒళ్లంతా గాయాలతో చావుబతుకుల మధ్య ఉన్న రోజుల పసికందును తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయింది పొరుగూరి సర్పంచ్‌. వైద్యులూ నర్సులూ పగలూ రాత్రీ కష్టపడి ఆ బిడ్డను బతికించారు కానీ కోలుకున్న పాపను తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. బలహీనంగా ఉన్న ఆ బిడ్డని జాగ్రత్తగా చూడాలి, పట్టణంలోనేమో ఒక్క అనాథాశ్రమమూ లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదన్న కొడుకు మాటలకు ‘ఇంటికి తీసుకురా నేను చూసుకుంటా’ అని చెప్పారు ప్రభావతి. అలాగే చూసుకుని ఆర్నెల్లు తిరిగేసరికల్లా ఆరోగ్యంగా తయారై ముద్దొస్తున్న ఆ పాపాయికి మోహిని అని పేరు పెట్టారు. అయితే ఏనాడూ ఆస్పత్రివైపు కన్నెత్తి చూడని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ వాళ్లు (అనాథ పిల్లలకు ఒక నీడ ఏర్పాటుచేయాల్సిన బాధ్యత వీరిదే) పాప కోలుకుని అంతా బాగుండేసరికి వచ్చి తీసుకెళ్లిపోయారు. ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిన ఊరి సర్పంచ్‌కే మళ్లీ అప్పజెప్పారు. అక్కడ పాపకు భద్రత ఉండదని భావించిన ప్రభావతి న్యాయస్థానానికి వెళ్లారు. కోర్టు చుట్టూ రెండేళ్లు తిరిగితే కానీ మోహిని మళ్లీ ప్రభావతి ఒడిలోకి రాలేదు. ఈ కోర్టు గొడవలకు చేయి సరిగా లేకపోవడమూ తోడవడంతో మోహినిని ఎవరూ దత్తత తీసుకోలేదు.

ప్రభావతి దత్తత తీసుకోవటానికి చట్టం ఒప్పుకోదు. అందుకని కేవలం మోహిని కోసం ఓ అనాథాశ్రమాన్నే ప్రారంభించారు ప్రభావతి. అయినా సమస్య తీరలేదు. పాపని అనాథగా ప్రకటించడానికి కావలసిన సమాచారం పూర్తిగా లేదని లిటిగేషన్‌ పెట్టారు హక్కుల సంఘంవాళ్లు. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా పెంచిన ప్రేమ ప్రభావతిని వెనకడుగు వేయనివ్వలేదు. పసిబిడ్డగా మోహినిని తాము ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల నుంచీ కోర్టు తీర్పు వరకూ అన్నీ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టారు. ప్రత్యేక కేసుగా పరిగణించి పాపను తనకి అప్పజెప్పాలని కోరారు. పూర్వాపరాలన్నీ పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. అలా నాలుగేళ్ల మోహినితో మొదలుపెట్టి, ఆస్పత్రిలో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన పిల్లలందరికీ ప్రభావతి నెలకొల్పిన ‘కిల్‌బిల్‌’ అనాథాశ్రమమే ఇల్లయింది. గత 22 ఏళ్లలో దాదాపు 300 మంది పిల్లలు కిల్‌బిల్‌లో పెరిగి చదువుకుని ఉద్యోగస్తులయ్యారు. ఎనభయ్యారేళ్ల ప్రభావతి తన కొడుకు డాక్టర్‌ ప్రియదర్శన్‌ సాయంతో ఇప్పటికీ పిల్లల ఆలనా పాలనా చూస్తుంటారు. తన పోరాటాన్ని వివరిస్తూ ప్రభావతి రాసిన పుస్తకానికి మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా లభించింది.

సుప్రీంకోర్టునే ప్రశ్నించింది:పద్నాలుగేళ్ల క్రితం ఓ రోజు... పిల్లల్ని ఇంట్లో దించి తాము బయట భోజనం చేస్తామని చెప్పి వెళ్లారు సునీల్‌ రేష్మా దంపతులు. అలా వెళ్లిన కొడుకూ కోడలూ కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తారనుకున్నారు సరళాపరేఖ్‌ దంపతులు. కానీ, వాళ్లు అసలు రానేలేదు. టీవీలో తీవ్రవాదుల దాడి గురించిన వార్తలూ... పలకని కొడుకూ కోడళ్ల ఫోన్లూ... ఆ వృద్ధులకు జరగరానిదేదో జరిగిందని చెబుతూనే ఉన్నాయి. కానీ కన్న ప్రేమ దానిని అంగీకరించడం లేదు. మూడో రోజున తూటాలతో చిల్లులు పడి నిర్జీవమైన శరీరాల్ని అప్పగించారు అధికారులు. ఉన్న ఒక్కగానొక్క కొడుకునీ కోల్పోయిన ఆ వృద్ధులకి మనసారా ఏడ్చే అవకాశం లేకపోయింది. పది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు మనవరాళ్లూ అమ్మానాన్నల్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక నానమ్మా తాతయ్యల్ని కరుచుకుపోయారు. పిల్లల్ని ఓదార్చడానికి తమ దుఃఖాన్ని దిగమింగుకోక తప్పలేదు వారికి. ఏడు పదుల వయసులో మరోసారి అమ్మానాన్నలయ్యారు. పదిహేనేళ్ల క్రితం కొడుక్కి అప్పజెప్పిన వ్యాపారాన్ని తిరిగి చేపట్టారు 78 ఏళ్ల సెవంతీలాల్‌ పరేఖ్‌.

ఇంకా డబ్బు సంపాదించాలని కాదు, తాను అప్పజెప్పిన వ్యాపారాన్ని కష్టపడి మూడింతలు చేసిన కొడుకు మీద గౌరవంతో. మరోపక్క సరళ మనవరాళ్లని అక్కున చేర్చుకుని వాళ్ల మంచీ చెడూ చూస్తున్నదన్న మాటే కానీ కంటినిండా కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు. ‘నాన్నమ్మా... అమ్మానాన్నల్ని ఎవరు చంపేశారు’ అని అమాయకంగా అడుగుతున్న ఆ బిడ్డలకు ఏమని సమాధానం చెబుతుంది. ఆమెకు ఎప్పుడూ ఒకటే ఆలోచన. ఎవరికి అన్యాయం చేశారని ఈ పసిబిడ్డలకు తల్లీ తండ్రీ దూరమయ్యారు, ఏం పాపం చేశామని ఈ వయసులో మాకీ కడుపుకోత... దాదాపు రెండు వందల కుటుంబాలది ఇదే పరిస్థితి. అమ్మానాన్నల్ని కోల్పోయి అనాథలైన బిడ్డలు కొందరు. కన్నబిడ్డల్ని పోగొట్టుకుని కన్నీరింకిపోయేలా ఏడుస్తున్న తల్లిదండ్రులు కొందరు. ఏం చేస్తే వారి కష్టం తీరుతుంది? అసలీ కష్టానికి బాధ్యులెవరు- అన్న ఆలోచన ఆమెను నాన్నమ్మ పాత్ర నుంచి సామాజిక కార్యకర్త పాత్రలోకి తెచ్చింది. నగరంలో సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటూ సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించింది. భద్రతా లోపమే ఈ విపత్తుకి కారణమనీ కీలకమైన ప్రదేశాలన్నిట్లోనూ సీసీ కెమెరాలు ఉన్నట్లయితే ఇంత తీవ్రమైన సంఘటనలు జరిగేవా అనీ అడిగింది. తనలాంటి మరికొందరిని సమీకరించి ఒక ఉద్యమమే లేవదీసింది. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా అంటూ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది. ‘మీరు చేయలేకపోతే చెప్పండి, మేమే చేసుకుంటాం’ అంటూ అరవై కోట్ల మొత్తాన్ని విరాళాలుగా సేకరించింది. ‘ఈ డబ్బు తీసుకుని సీసీ కెమెరాలు అమర్చండి, నగరంలో భద్రతపై మాకు నమ్మకం కలిగించండి’ అంటూ న్యాయస్థానాన్ని అర్థించింది. ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య తలెత్తిన ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. సీసీ కెమెరాల బాధ్యత ప్రభుత్వానిదే తప్ప ప్రజలది కాదన్న కోర్టు- వారి ప్రతిపాదనని తిరస్కరించింది. అయితే ఎనిమిదేళ్ల ఈ పోరాటం వృథా కాలేదు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను బాగా పెంచింది ప్రభుత్వం.

వందలాది మందికి కంటిచూపు తెప్పించింది!:అకౌంటెంట్‌ ఉద్యోగమూ ఇంటి పనులూ ఎదుగుతున్న ఇద్దరు పిల్లల బాధ్యతలూ వర్షా వేద్‌కి ఊపిరి సలపనిచ్చేవి కాదసలు. పైగా ముంబయిలో లోకల్‌ రైలెక్కి ఉద్యోగానికి వెళ్లిరావడమంటే అదో పరుగుపందెమే. అసలు జీవితం గురించి ఆలోచించే తీరిక లేకుండా కాలం గడిచిపోతున్న వేళ ఆమెకి కళ్ల కలక వచ్చింది. సాధారణ సమస్యే కాబట్టి ఆమె భయపడలేదు. నాలుగు రోజులు పిల్లల్ని దగ్గరకు రానీయకుండా చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంది. అది తగ్గిపోగానే మామూలుగా ఆఫీసుకు వెళ్లింది. వారం తిరక్కుండానే కళ్లు మసకబారినట్లై రెండు కళ్ల చూపూ పోయింది. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే ఇన్‌ఫెక్షన్‌ కార్నియాకి సోకి పూర్తిగా వ్యాపించడం వల్ల చూపు పోయిందనీ దానికి చికిత్స లేదనీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్స ఒక్కటే మార్గమనీ చెప్పారు. ఆ శస్త్రచికిత్స కూడా దాతల కార్నియా దొరికితేనే సాధ్యమవుతుందన్నారు.

అప్పటివరకూ ఆమె అంధురాలిగానే గడపాలి. అది వినగానే వర్ష గుండెల్లో రాయి పడింది. చూపు లేకుండా ఉద్యోగం చేయలేదు, ఇంట్లోనేమో ఇద్దరూ చిన్న పిల్లలు. కళ్లు కనపడకపోతే తన పని తాను చేసుకోవడమే సాధ్యం కాదు, ఇక ఇంటిపనులు సంబాళించుకోవడం ఎలా? ఆటలకు వెళ్లి దెబ్బ తగిలించుకుని ఏడుస్తూ వచ్చిన కొడుక్కి దెబ్బ ఎక్కడ తగిలిందో, అది ఎంత దెబ్బో తెలియక కంగారుపడిపోయేది. నమోదు చేసుకున్నాక దాత దొరికి వర్షకి ఒక కన్నుకి సర్జరీ చేయడానికి రెండేళ్లు పట్టింది. మరో కంటికి ఇంకో ఏడాది. ఈ మూడేళ్లలో వర్ష ఎదుర్కొన్న అనుభవాలు మొత్తంగా ఆమె దృక్పథాన్నే మార్చేశాయి. భర్తకి తరచూ సెలవు పెట్టడం కష్టం కాబట్టి పన్నెండేళ్ల కూతుర్నే సాయంగా తీసుకుని ఆస్పత్రికి వెళ్లేది. అక్కడ ఆమెకి ఒక కొత్త ప్రపంచం తెలిసింది. రకరకాల కారణాల వల్ల చూపు కోల్పోయి కన్నబిడ్డలను కళ్లారా చూసుకోలేని తమ దురదృష్టానికి బాధపడే తల్లులూ, అమ్మ ముఖాన్ని చేత్తో తడిమి తడిమి చూసుకునే బిడ్డలూ ఎందరో
పరిచయమయ్యారు. దాతల కార్నియాలు దొరికితే తనలాగా వాళ్లకీ చూపు వస్తుంది. కానీ దాతలేరీ..? తనకి చూపురాగానే వర్ష చేసిన పని తన కుటుంబ సభ్యులందరి చేత నేత్రదానానికి వాగ్దానం చేయించడం. అక్కడితో ఆగలేదామె. మళ్లీ ఉద్యోగం ఊసెత్తకుండా నేత్రదానం గురించి ప్రచారం చేసే కార్యకర్తగా మారిపోయింది. ఐ బ్యాంక్‌ కోఆర్డినేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంది. చుట్టుపక్కల ఏ ఆస్పత్రిలో రోగి మరణించినట్లు తెలిసినా వెంటనే అక్కడికి చేరుకుంటుంది. విషాదంలో ఉన్న బంధువులతో మాట కలిపి వారిచేత నేత్రదానానికి ఒప్పిస్తుంది. అలా గత 18 ఏళ్లుగా ఆమె కొన్ని వందల మందికి చూపు తెప్పించింది, కొన్ని వేలమంది చేత నేత్రదానానికి వాగ్దానం చేయించింది.

ఒక్కబిడ్డ కోసం వెయ్యిమందికి అమ్మయింది!:లఖ్‌నవూలోని ఒక మామూలు మధ్యతరగతి ఇల్లు అది. వాకిట్లో పసిపిల్లల్ని పడుకోబెట్టే ఉయ్యాల ఒకటి ఎప్పుడూ ఉంటుంది. ఏ అర్ధరాత్రో కన్నతల్లి చేతుల మీదుగా ఆ ఉయ్యాలలోకి వచ్చి తెల్లవారుతూనే ఆ ఇంటి ఇల్లాలి ఒడిలోకి చేరిన పసిబిడ్డలు కొన్ని వందల మంది. వాళ్లంతా ఆ చల్లని తల్లి నీడన అమ్మ ప్రేమనీ నాన్న ఆదరణనీ చవిచూస్తూ పెరిగారు. చదువుకున్నారు. తమ కాళ్లమీద తాము నిలబడే శక్తి వచ్చాక ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నారు. ఇంతకీ ఎవరామె, ఎందుకా ఉయ్యాల... అంటే-దాదాపు నలభై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సరోజిని అగర్వాల్‌కి నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకుల తర్వాత పాప పుడితే బాగుంటుందనుకుంటే బాబు, పాప- కవలలు పుట్టారు. ముగ్గురబ్బాయిల మధ్య ఒక్కగానొక్క పాప కావడంతో మనీషా అంటే అందరికీ అపురూపం. ఒకరోజు ఎనిమిదేళ్ల మనీషాని స్కూటరు మీద ఎక్కించుకుని బజారుకు వెళ్లింది సరోజిని.

దారిలో ఓ వాహనం వేగంగా వచ్చి స్కూటర్ని ఢీకొంది. వెనక కూర్చున్న మనీషా రోడ్డుమీద పడిపోవడంతో తలకి బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సరోజినిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తనే చేతులారా బిడ్డను చంపుకున్నానన్న భావన ఆమెను స్థిమితంగా ఉండనివ్వలేదు. సరోజినికి సామాజిక చైతన్యం కల రచయిత్రిగా మంచి పేరుంది. పసిబిడ్డల్ని చెత్తకుండీల దగ్గరా రైల్వే ప్లాట్‌ఫారాల మీదా వదిలేసే సంఘటనల గురించి తెలుసు. కనీసం అలాంటి పిల్లల్ని అయినా చేరదీసి వారిలో తన బిడ్డను చూసుకోవాలనుకుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక స్తోమత కోసం వేచి చూసింది. పుస్తకాలమీద తనకి వచ్చిన డబ్బంతా దాచిపెట్టింది. పెద్ద కొడుకు ఉద్యోగంలో చేరాక తన మనసులోని మాటను వెల్లడించిందామె. భర్తా కొడుకులూ సంతోషంగా అంగీకరించారు. అలా 1985లో మూడు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని ‘మనీషా మందిర్‌’ పేరుతో అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. కాన్పులోనే తల్లిని పోగొట్టుకున్న ఒక మూగచెవిటి పాప- ఆశ్రమానికి చేరిన తొలిబిడ్డ. ఆ తర్వాత రోజుకొకరు చొప్పున చేరుతూనే ఉన్నారు. పసికందుల్ని ఏ చెత్త కుండీ దగ్గరో వదిలేసే బదులు అందుకు తగిన ఏర్పాటేదో తన ఇంటి దగ్గరే చేస్తే పిల్లలు భద్రంగా ఉంటారన్న ఆలోచనతో ఆమె వీధి వాకిట్లో ఉయ్యాలను ఏర్పాటుచేసింది. పొద్దున్నే లేవగానే సరోజిని చేసే మొదటి పని ఉయ్యాల చూడడం. అందులో పిల్లలుంటే ప్రేమగా అక్కునచేర్చుకోవడం. అలా మొదలైన ఆశ్రమంలో ఇప్పటివరకూ వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందారు. మూడు గదుల చిన్న ఇంటి నుంచి మూడంతస్తుల విశాలమైన సొంత మేడలోకి మారింది మనీషామందిర్‌. గ్రంథాలయంతో పాటు పిల్లలు తమ అభిరుచికి తగిన విద్య నేర్చుకోవడానికి అవసరమైన సౌకర్యాలన్నీ అక్కడ ఏర్పాటుచేశారు. సరోజినికి ఇప్పుడు 87 ఏళ్లు. అయినా ఆడపిల్లలకు ఏ సాయం కావాలన్నా నేనున్నానంటూ ఉత్సాహంగా ముందుకొస్తుందామె.

అమ్మ... ప్రేమకు మారుపేరు అమ్మ మనసు పూలతేరు... అన్నారో కవి. ఆ పూలతేరులో కన్నబిడ్డలకే కాదు, పుష్పకవిమానంలా ఎందరికైనా చోటుంటుందని నిరూపిస్తున్న ఇలాంటి మాతృమూర్తులు ఎందరో. వారందరికీ ఈ మాతృదినోత్సవ వందనం..!

ఇవీ చూడండి:Bhadradri Ramayya: ఘనంగా భద్రాద్రి రామయ్య రథోత్సవ వేడుక

నీటి మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details