నవమాసాలు మోసి, కష్టపడి పెంచిన ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఏమీ ఆశించదు. కాస్త ప్రేమను తప్ప! మరి అలాంటి అమ్మ గురించి నేడు మనం ఆలోచిస్తున్నామా.. అనుక్షణం మన బాగు గురించే పరితపించే అమ్మను రోజులో ఒక్కసారైనా పలకరిస్తున్నామా.. మదర్స్ డే రోజు అమ్మతో ఓ ఫొటో దిగి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అమ్మ సంతోషిస్తుందా..? పెద్ద పెద్ద డైలాగులను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెడితే.. ఎక్కడో పల్లెలో ఉన్న అమ్మ కళ్లల్లో ఆనందం కనిపిస్తుందా.. ? మరేం చేద్దాం. మాతృ మూర్తులకున్న ఈ ప్రత్యేకమైన రోజుని.. ఇలా ప్రత్యేకంగా మారుద్దాం.
గుర్తు చేసుకుందాం..
వేలుపట్టి అడుగులేయించిన అమ్మను.. చేయి పట్టుకుని సాయంకాలం కాసేపలా బయటకు తీసుకెళ్దాం. బాల్యంలో చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆమెతో ఆనందంగా గడుపుదాం. బిజీబిజీగా సాగిపోతోన్న జీవితంలో.. కనీసం ఈ ఒక్క పూటైనా తల్లితో కలిసుందాం.
మెచ్చే వంట చేద్దాం..
ఇన్నేళ్ల నుంచి మనం అడిగిందల్లా వండి పెట్టే అమ్మకు.. ఇష్టమైన ఆహారమేదైనా ఈ రాత్రి డిన్నర్‌లోకి వండుదాం. ఖాళీ కడుపుతో.. మన కడుపు నింపిన అమ్మకు మన చేతులతోనే వడ్డిద్దాం. ఆమెకు కబుర్లు చెబుతూ.. కలిసి భోజనం చేద్దాం.
అప్యాయంగా మాట్లాడుదాం..
తన గురించి ఆలోచించుకునే సమయం, ధ్యాస ఉండని వ్యక్తి అమ్మ. అన్ని బాధల్ని దిగమింగుకొని.. నవ్వుతూ ప్రేమను పంచే అమ్మతో.. వీలైనంతా అప్యాయంగా మాట్లాడుదాం. ఎంత బిజీగా ఉన్నా.. ఈ పూటను ఆమెకిలా కేటాయిద్దాం.
విశ్రాంతి నిద్దాం..
పొద్దంతా గొడ్డు చాకిరి చేసే అమ్మకు.. కనీసం ఈ రోజైనా విశ్రాంతినిద్దాం. ఆమెతో కలిసి ఆడుతూ పాడుతూ పని చేద్దాం. నాన్నకైనా అప్పుడప్పుడూ విరామం దొరుకుతుంది.. కానీ అమ్మకు ప్రతిరోజూ అదే పని. లాక్ డౌన్ లాంటి సమయాల్లో కూడా ఖాళీ లేని ఏకైక వ్యక్తి అమ్మే.
క్షమాపణలు కోరుదాం..
ఏళ్ల తరబడి అమ్మకు చెప్పాలనుకున్నది ఏదైనా చెప్పలేక పోతున్నామెమో ఆలోచిద్దాం. ఏ విషయంలోనైతే తప్పు చేశామని భావిస్తున్నామో.. దానిని ఓ పేపర్‌పై రాసి ఇద్దాం. ఆ విషయాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుదాం. మనసులో ఉన్న భారాన్ని ఈ రోజుతో దించేసుకుందాం.
సర్ప్రైజ్ చేద్దాం..
అమ్మకు ఇష్టమైనవేవో జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను ఓ దగ్గర చేర్చుదాం. ఆల్బమ్‌గా ఆమెకిచ్చి సర్ప్రైజ్ చేద్దాం. ట్రంకు పెట్టేలో ఉన్న పాత ఫొటోలేవో బయటకు తీసి.. ఓ ఫ్రేమ్‌గా చేయించి ఇద్దాం. దూరమైన ఆమె పాత స్నేహితురాల్లతో కాసేపు ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
స్మార్ట్ ఫోన్ కొనిద్దాం..
ఉద్యోగరీత్యా పట్నంలో ఉంటోన్న మనం.. పల్లెల్లోని అమ్మకు ఓ స్మార్ట్ ఫోన్‌ను కొని బహుమతిగా పంపుదాం. సరదాగా స్నేహితులతో, ఆఫీసు పని మీద వీడియో కాల్ మాట్లాడినట్లే .. వీలైనప్పుడు అమ్మకూ కాస్త సమయాన్ని కేటాయిద్దాం. ఆమెలో.. మనం దూరంగా ఉన్నామనే భావనను తొలగిద్దాం. ఏమో.. మనల్ని చూసిన రోజంతా ఆమెకు సంతోషంగా గడవొచ్చు..!
ఇవన్నీ చేస్తే.. అమ్మ రుణం తీరిపోతుంది అనుకుంటే పొరపాటే మళ్లీ. ఆమె రుణం తీర్చుకోవాలంటే.. ఎన్ని జన్మలైనా చాలవనే చెప్పాలి. వచ్చే జన్మలో ఆ అమ్మకు మనమే అమ్మైతే తప్ప..!
చివరగా..
కాలికి ముళ్లు గుచ్చుకొని బిడ్డ విలవిల్లాడితే.. తమ కళ్లలో కన్నీళ్లు తెచ్చుకొనే అమ్మలకు, చదువు రాకపోయినా చంటి పిల్లలకు బుద్ధి నేర్పిన అమ్మలకు, అష్ట కష్టాలు పడి బిడ్డకో దారి చూపిన అమ్మలకు, ఇంకా గడప దగ్గరే కూర్చొని.. బిడ్డ అడుగుల కోసం ఎదురు చూసే అమ్మలకు, పిల్లలు ద్వేషించినా.. దూషించినా విసుగు చెందని అమ్మలకు, వృద్ధాప్యంలోనూ.. తన పిల్లాడింకా చిన్నవాడే అనుకొంటూ కల్తీ లేని ప్రేమను చూపే అమ్మలకు.. ఇలా లోకంలో ఉన్న ఎందరో అమ్మలందరికీ ఈటీవీ భారత్ తరఫున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
ఇదీ చదవండి:తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది సృష్టిలోనే లేదు: సీఎం కేసీఆర్