Mother kills kids in Alwal in Hyderabad: హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేసే నర్సింగ్‌రావుకు అన్నానగర్‌కు చెందిన సంధ్యారాణి(29)తో 2012లో మేనరిక వివాహం జరిగింది. ప్రస్తుతం కానాజిగూడ పరిధిలోని శివనగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 2017లో కవల పిల్లలు జన్మించారు. వారికి పుట్టుకతోనే ఓ శిశువుకు వైకల్యం ప్రాప్తించగా, మరొకరికి గుండెలో రంధ్రాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారం వ్యవధిలో కవల పిల్లలు ఇద్దరూ చనిపోయారు. 2018లో మరోసారి సంధ్యారాణి గర్భం దాల్చింది. కడుపులోనే శిశువు మృతి చెందడంతో గర్భస్రావం జరిగింది.
అప్పట్నుంచి ఆమె పిల్లలు దూరమయ్యారనే మానసికంగా వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో మరోసారి గర్భం దాల్చిన ఆమె..ఈ నెల 11వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కవల పిల్లలకు (మగ, ఆడ) జన్మనిచ్చింది. పూర్తిగా నెలలు నిండకముందే ప్రసవం కావడం, పిల్లలు బరువు తక్కువగా ఉన్న కారణంగా మగ శిశువును మూడు రోజులు ఐసీయూలో ఉంచడం వంటి పరిణామాలు తల్లిని మనోవేదనకు గురిచేశాయి. ఈ నెల 14వ తేదీన తల్లీబిడ్డలు ఇంటికి చేరుకున్నప్పటికీ ఆమెను పాత జ్ఞాపకాలు వెంటాడాయి. గతంలో మాదిరిగానే ఇప్పుడు పుట్టిన బిడ్డలూ అనారోగ్యంతో చనిపోతారనే భయం ఆమెను కుంగిపోయింది.