Computer Science Course : అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో అయిదోవంతుకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరుతున్నారు. ఆ సంఖ్య ఏటేటా పెరుగుతుండగా...మిగిలిన కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో విద్యకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 36.8 శాతం మంది కంప్యూటర్ సైన్సే చదువుతున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) విడుదల చేసిన ఓపెన్ డోర్స్-2022 నివేదిక ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది.
Demand for Computer Science Course : దాని ప్రకారం 2021-22లో అమెరికాలో అనేక దేశాలకు చెందిన 9.48 లక్షల మంది చదువుతున్నారు. వారిలో కంప్యూటర్ సైన్స్ (సీఎస్)లో చేరేవారే 2 లక్షల మంది (21.10 శాతం). వారిలో చైనా నుంచి 67 వేల మంది, భారత్ నుంచి 73 వేల మంది ఉండటం గమనార్హం. అమెరికాలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో వేతనాలు అధికంగా ఉండటంతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల వారు కంప్యూటర్ సైన్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఐఎంఎఫ్‌ఎస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ వేములపాటి అజయ్‌కుమార్ చెప్పారు. మున్ముందు ఆ కోర్సులో చేరే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన తెలిపారు.