తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు తీయాలంటే.. జేసీబీ రావాల్సిందే! - Heavy flood in Hyderabad

భారీ వర్షాలకు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వాహనాలు మునిగిపోయాయి. వరద రావడంతో చాలా బైక్‌లు, కార్లు, ఆటోలు ధ్వంసం అయ్యాయి. వరద ఉద్ధృతికి ద్విచక్ర వాహనాలు కొన్ని కొట్టుకుపోయాయి. రాజేంద్రనగర్‌లో ఉండే ఓ ద్విచక్ర వాహనాల మెకానిక్‌ వద్దకు సాధారణ రోజుల్లో నిత్యం 50-70 వాహనాలు సర్వీసింగ్‌, మరమ్మతుల కోసం రావడమే గొప్ప విషయం. గత వారం రోజులుగా మరమ్మతులకు వచ్చే వాహనాల సంఖ్య మూడు, నాలుగు రెట్లు పెరిగింది.

most of the vehicles washed away in Hyderabad floods
హైదరాబాద్​ వరదలో చిక్కుకున్న వాహనాలు

By

Published : Oct 18, 2020, 9:12 AM IST

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్​ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పల్లె చెరువు, అప్పా చెరువుల కింద ఉన్న కాలనీలు, బస్తీల్లో ఎక్కువ నష్టం జరిగింది. వరద నీరు ఆరేడు అడుగుల ఎత్తులో రావడంతో భారీ స్థాయిలో బురద, ఇసుక ఎక్కడికక్కడ మేట వేసింది. ఇళ్ల ముందు ఉన్న బైక్‌లు, కార్లు ఈ ఇసుక, మట్టిలో కూరుకుపోయాయి. చాలామంది ట్యాక్సీలు, ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. విధుల ముగిసిన తర్వాత వీటిని ఇంటి బయట పార్కింగ్‌ చేస్తుంటారు. ఇలా ఒక్కసారిగా వరద రావడంతో చాలా బైక్‌లు, కార్లు, ఆటోలు ధ్వంసం అయ్యాయి. వరద ఉద్ధృతికి ద్విచక్ర వాహనాలు కొన్ని కొట్టుకుపోయాయి.

చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చాలా బస్తీల్లో ఎక్కువ ఈ పరిస్థితి కనిపించింది. గగన్‌పహాడ్‌, అలీనగర్‌ తదితర ప్రాంతాల్లో వాహనదారులకు పూడ్చుకోలేని నష్టం ఏర్పడింది. ముఖ్యంగా కార్లు, ఆటోలు లాంటి వాటిని బురద, మట్టి నుంచి తీయాలంటే తప్పకుండా జేసీబీ అవసరం అవుతుంది. మట్టిలో పూడుకు పోవడం వల్ల ఇంజన్‌, సీట్లు, ఏసీలు, లైట్లు, స్టీరింగ్‌, టైర్లు అన్ని దెబ్బతింటాయి. చాలామంది బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌లో అప్పులు తీసుకొని వాహనాలు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. కార్లు, ఆటోలు పూర్తిగా ధ్వంసం కావడంతో తమ ఉపాధికి గండి పడిందని గగన్‌పహాడ్‌కు చెందిన రషీద్‌ తెలిపారు. బీమా లేని వాహనాలైతే భారీగా నష్టపోయేనట్టేనని నిపుణులు కూడా చెబుతున్నారు. వరదలో మునిగి కార్లలోని ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ మాడ్యులర్‌(ఈసీఎం),పవర్‌స్టీరింగ్‌, ఇంజన్‌, బేరింగ్‌లు పూర్తిగా పాడైపోయాయి.

ఈ జాగ్రత్తలు అవసరం

  • కొందరైతే బండి ఇంజన్‌ వరకు మునిగేలా వరద ఉన్నాసరే అందులోంచి వెళ్తుంటారు. దీని వల్ల లోపలకు నీళ్లు పోయి తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రత్యామ్నాయ రహదారులు చూసుకోవాలి. కారు అయితే టైరు సగం కంటే ఎక్కువ మునుగుతుంటే ముందుకు వెళ్లక పోవడమే మంచిది.
  • అపార్ట్‌మెంట్‌ లేదా కాలనీలోకి వరద వచ్చే అవకాశం ఉంటే సురక్షిత ప్రాంతాల్లో నిలిపి పైన కవర్‌ కప్పి ఉంచాలి. నగరాల్లో అద్దెకు పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది వినియోగించుకోవచ్ఛు.
  • బైక్‌లు వర్షంలో తడిసిన తర్వాత మెకానిక్‌ దగ్గరు తీసుకెళ్లి షాక్‌ అబ్జర్వర్లు, క్లచ్‌ప్లేట్లు, వీల్‌ బేరింగ్‌లు, చైన్‌కిట్‌, ఇంజన్‌, ఇంజన్‌ ఆయిల్‌ చెక్‌ చేసుకోవాలి.
  • కారు నీటిలో మునిగితే ఎట్టి పరిస్థితిలో స్టార్ట్‌ చేయకూడదు. దీనివల్ల కారులోని ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ మాడ్యువల్‌, పవర్‌ స్టీరింగ్‌ దెబ్బతింటాయి. పూర్తిగా నీరు బయటకు పోయిన తర్వాత మెకానిక్‌ను పిలిపించాలి. ఇలా అయితే రూ.5 వేలతో తేలిపోతుంది. ఒకవేళ స్టార్ట్‌ చేస్తే లక్షల్లో మరమ్మతుల ఖర్చు తప్పవు.

ABOUT THE AUTHOR

...view details