హైదరాబాద్లో ఉన్న పబ్లన్నీ దాదాపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ పబ్ల వల్ల ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రాంతంలో మద్యం బాబుల హంగామా ఉంటుంది. బడి, గుడికి దూరంగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి సమీపంలోనే ఓ పబ్ ఏర్పాటు చేశారు.
అనుమతి లేకున్నా!
ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతాల్లో పబ్ల ఏర్పాటు విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. బార్ల పేరుతో అనుమతి తీసుకొని పబ్లు నిర్వహిస్తున్నట్లు విమర్శలున్నాయి. చాలా పబ్లకు జీహెచ్ఎంసీ అనుమతి కూడా లేదు. పబ్ నిర్వాహకులు సైతం పార్టీల పేరుతో వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. ఇటీవలి ఓ పబ్లోడబ్బు చెల్లింపుల విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం... దాడికి దారి తీసింది. యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... బౌన్సర్ల ఆగడాలపై పశ్చిమ మండల డీసీపీ ప్రత్యేక దృష్టి సారించారు.