మహమ్మారి వైద్య సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్నా నిమ్స్‌లో ఇప్పటికీ అన్ని రకాల స్పెషాలిటీ సేవలను నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ రెండోదశలో ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. వైద్యసిబ్బంది కూడా కొవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సహాయక సిబ్బంది సహా సుమారు 25% మంది బాధితులుగా నిర్ధారణ అవుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైద్యంలోనే కాదు.. ప్రైవేటులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కొవిడ్ సేవలు అందించడానికి వైద్యులు, నర్సులు తదితర సిబ్బంది కొరత ఏర్పడుతోంది.
ఎందుకింత తీవ్రత?
తొలిదశ ప్రారంభంలోనే లాక్‌డౌన్ విధించారు. అప్పుడు సాధారణ శస్త్రచికిత్సలు, ఓపీలు నిలిచిపోయాయి. అందువల్ల కేవలం అత్యవసర వైద్యానికి మాత్రమే ఆసుపత్రులకు వెళ్లేవారు. దాంతో అప్పుడు వైద్యులు, నర్సులు ఇప్పటిలాగా ఎక్కువమంది కొవిడ్ బారిన పడలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికీ సాధారణ ఓపీ సేవలు, ముందస్తుగా ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలు కొనసాగుతున్నాయి. సాధారణ రోగులు పెద్దసంఖ్యలోనే ఆసుపత్రులకు వస్తున్నారు. ఇదే సమయంలో నెలరోజులుగా వైరస్ విజృంభిస్తోంది. పరీక్షల కోసం, టీకాల కోసం ఆసుపత్రులకొచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. పైగా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నది ‘డబుల్ మ్యూటెంట్ వైరస్’ అని నిపుణులు చెబుతున్నారు. అతి వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్.. అతి తక్కువ సమయంలోనే అక్కడ గుమిగూడిన ఎక్కువమందికి సోకుతోంది. వైద్యులు సహా సిబ్బంది అందరూ ‘వైరస్ ముప్పు పొంచి ఉన్న అతి ప్రమాదకర ప్రాంతంగా’ గుర్తించిన ఆసుపత్రుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఓపీలో కరోనా బాధితులెవరో, కానివారు ఎవరో కూడా తెలియని స్థితిలో రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. రోగులు మాస్కు ధరించకుండా.. దగ్గడం, మాట్లాడటం ద్వారా ఆ ప్రదేశంలో వైరస్ జాడలను వదిలి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని తాకినా, అక్కడి గాలిని పీల్చాల్సి వచ్చినా.. అనివార్యంగా ఏదో ఒక సందర్భంలో వైద్యసిబ్బంది కొవిడ్ బాధితులుగా మారుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.