తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పురుషుల్లోనే అధికమట!

భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో పురుషులే అధిక శాతం ఉండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

By

Published : May 7, 2020, 11:28 AM IST

Hyderabad  corona cases latest news
Hyderabad corona cases latest news

గ్రేటర్‌ వ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో పురుషులే అధిక శాతం ఉండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. నగరంలోని మొత్తం కొవిడ్‌ కేసుల్లో(మే 2వరకు) 66.5 శాతం వరకు పురుషులే ఉన్నారు. ఇంటి పెద్ద జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంట్లోని అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే.. ఇంటిపెద్ద బయటకు వెళుతుంటాడు. ఈ క్రమంలో బయట ప్రాంతాల్లో వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదు.

మరికొందరైతే ఎలాంటి పనులు లేకపోయినా బయటకు రావడం వల్ల కూడా కరోనాను స్వయంగా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులకు వారికి తెలియకుండానే వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ‘తెలిసి కొంత...తెలియక కొంత కరోనా రాకాసికి చిక్కుతున్నాం. ఒకరి వల్ల ఇలా ఇంట్లో మహిళలు, చిన్నారులకు సోకుతోంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 70 మంది వరకు పిల్లలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇందులో 95 శాతం మందికి తమ తల్లిదండ్రుల ద్వారా వచ్చినదే. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చు’నని వైద్యులు పేర్కొంటున్నారు.

స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష...

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కంటెయిన్‌మెంట్‌ జోన్లలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక్కడ కేసులు ఎక్కువ శాతం ఉండటంతో ఆ ప్రాంతాల్లో రాకపోకలు నియంత్రిస్తోంది. ఇలా నగర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. కొన్నిరోజుల తర్వాత అక్కడ కేసులు తగ్గితే ఆ జోన్లను ఎత్తివేస్తోంది. అయితే నాన్‌ కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కాలనీల్లో మార్కెట్ల పేరుతో అధిక సంఖ్యలో జనం గుమిగూడటం వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉంది.

కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ చాలామంది మాస్క్‌లు లేకుండా బయట తిరగడం...ఇతర జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల కుటుంబంలో ఇతర సభ్యులు ప్రమాదంలో పడినట్లే. మన కోసం మనం అన్నట్లు ఈ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర విధులు, సరకులు ఇతర అవసరాల కోసం బయటకు వచ్చే వారు విధిగా మాస్క్‌ ధరించాలి. ఇంట్లోకి వెళ్లేముందు చేతులు సబ్బుతో కడుక్కోవడం లేదంటే హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ఇంట్లోనూ కుటుంబసభ్యులతో ఎడం పాటిస్తే మంచిది. ఎలాంటి లక్షణాలు ఉన్నా సరే... నిర్లక్ష్యం చేయకుండా 104 కాల్‌ సెంటర్‌లో సంప్రదించాలని సూచిస్తున్నారు.

కరోనా పాజిటివ్​ కేసులు ఇలా...

ABOUT THE AUTHOR

...view details