తెలంగాణ

telangana

ETV Bharat / state

60శాతం ఆక్సిజన్‌ మీదే ఆధారం - కరోనా తాజా వార్తలు

కరోనా బారిన పడి ఆసుపత్రులకు వెళ్తున్న బాధితులకు.. ప్రాణ వాయువు అవసరం అవుతోంది. తొలి దశలో కంటే ఈసారే ఎక్కువ మందికి ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

most-of-the-corona-patients-needs-oxygen
కరోనా కలవరం: ఆక్సిజన్‌ మీదే 60% మంది

By

Published : Apr 23, 2021, 10:01 AM IST

మలిదశలో కొవిడ్‌ బారిన పడుతున్న వారిలో దాదాపు 60-70% మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతోంది. బాధితుల ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ 94 కంటే తగ్గినప్పుడు బయటినుంచి కృత్రిమంగా ఆక్సిజన్‌ అందిస్తారు. తొలిదశలో కంటే ఇప్పుడే అవసరం ఎక్కువగా ఉంటోందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండడం, ఊపిరితిత్తులకు అది నేరుగా నష్టం కలిగించడంతో ఆక్సిజన్‌ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు.

గతేడాది ఈ స్థాయిలో ఆక్సిజన్‌ అవసరం ఉన్న కేసులు చూడలేదని ఆయన అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి ఊపిరితిత్తులు వైరస్‌ సోకగానే దెబ్బతినడంతో బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరి, ఆయాసం రావడంతో బాధితులకు ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం పెరుగుతుందని ఒంగోలు రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు తెలిపారు. ప్రాణవాయువు పరిపూర్ణ స్థితి 95-98 శాతం మధ్య ఉండాలి. 94 శాతం కంటే తగ్గితే ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తోంది. ప్రైౖవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారికి ఆక్సిజన్‌ దొరక్కపోతే.. అలాంటివారు ఆక్సిజన్‌ కోసమే ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు.

  • విజయవాడ జీజీహెచ్‌లో గురువారం రాత్రి వరకు 698 మంది బాధితులు ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. మరో పదిమంది క్యాజువాల్టీలో ఉన్నారు. వీరిలో 90% మందికి (ఐసీయూలో ఉన్న వారితో కలిపి) ఆక్సిజన్‌ అందిస్తున్నారు. మరో 40 మంది ఆక్సిజన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.
  • గుంటూరు జీజీహెచ్‌లో గురువారం మధ్యాహ్నానికి 720 మంది రోగులు ఉన్నారు. వీరిలో 130 మంది ఐసీయూలో ఉండగా మరో 500 మందికి ఆక్సిజన్‌ పెడుతున్నారు. సాధారణ పడకలపై 90 మంది ఉన్నారు.
  • విశాఖ కేజీహెచ్‌ ఐసీయూలో 300 మంది, ఆక్సిజన్‌ అందించే పడకలపై 1000 మంది ఉన్నారు. ఇంకొందరు సాధారణ పడకలపై ఉన్నారని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు.
  • అనంతపురం జిల్లాలోని ఆసుపత్రుల్లో 622 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో 61 మంది, ఆక్సిజన్‌పై 368 మంది బాధితులు ఉన్నారు. సాధారణ పడకలపై 193 మంది ఉన్నారు.
  • ఒంగోలు రిమ్స్‌లో గురువారం మధ్యాహ్నం వరకు 800 మంది పేషెంట్లు ఉన్నారని సూపరింటెండెంట్‌ శ్రీరాములు తెలిపారు. వీరిలో 320 మందికి ఆక్సిజన్‌ అందిస్తుండగా.. ఐసీయూలో సుమారు 100 మంది వరకు ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందన్నారు.

మేలుకోకపోవడం వల్లే..

మలిదశలో వైరస్‌ ఉద్ధృతంగా ఉండటంతో పాటు.. చాలామంది లక్షణాలున్నా సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడం, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా సమయానికి వైద్యులను సంప్రదించకపోవడం వల్లే ఆక్సిజన్‌ అవసరాలు పెరుగుతున్నాయని వైద్యులు విశ్లేషించారు. గతంలో కంటే ఈసారి యువకులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఊపిరి అస్సలు అందని పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కోసం ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి, చివరకు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి:కరోనాతో అగ్రిగోల్డ్​ డైరెక్టర్ మృతి

ABOUT THE AUTHOR

...view details