వ్యవసాయానికి పెట్టుబడి అంతకంతకూ పెరుగుతోంది. సాగు భారంగా మారుతోంది. అన్నదాతకు అండగా నిలవాల్సిన బ్యాంకులు నిర్దేశించుకున్న మేర రుణాలు అందించలేకపోతున్నాయి. రాష్ట్రంలో సాగు పెరుగుతూ, రుణాలు పొందుతున్న రైతుల సంఖ్య వృద్ధిచెందుతున్నా రుణమొత్తాలు మాత్రం నామమాత్రంగానే పెరుగుతున్నాయి. నాబార్డ్ నిర్దేశిస్తున్న రుణ ప్రణాళిక అమలు కావడం లేదు. సాగు రుణాలను పెంచాల్సిన అవసరాన్ని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తున్నా రుణ ప్రణాళిక అమల్లో ఉదాసీనత కనిపిస్తోంది. అప్పులు సకాలంలో అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాల్లో భారీగా కోత పడుతుండటంతో కర్షకులపై అప్పుల భారం పెరుగుతోంది. ప్రభుత్వం నుంచి ‘రైతుబంధు’ అందుతున్నా.. బ్యాంకులు పూర్తి స్థాయిలో రుణ ప్రణాళికను అమలు చేస్తేనే అన్నదాతలకు పెట్టుబడి తోడ్పాటు లభిస్తుంది. రాష్ట్రంలో ఐదేళ్లుగా వ్యవసాయానికి అందుతున్న రుణాలు, ఆర్‌బీఐ లక్ష్యాలు సహా రుణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర సాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) ఉపకమిటీ విశ్లేషించింది. ఆర్‌బీఐ కూడా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సహా ప్రాధాన్య రంగాలకు రుణాలు అందుతున్న తీరును సమీక్షించి తమ నిర్దేశిత బెంచ్ మార్క్ నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలోనూ ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, ప్రాధాన్య రంగాలకు రుణాలను అందించడంపై దృష్టిసారించాలని బ్యాంకులను ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ఆదేశించింది.
నిర్దేశించిన మేర బ్యాంకులు రుణాలివ్వడం లేవు: ఆర్‌బీఐ