తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫీవర్‌ సర్వే: గ్రేటర్‌ పరిధిలో 50 వేల మందికి పైగా కొవిడ్‌ లక్షణాలు - telangana latest news

రాష్ట్రవ్యాప్తంగా జ్వర బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైద్య బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఈ సర్వే ముమ్మరంగా సాగుతోంది. గ్రేటర్‌ పరిధిలో గత 15 రోజుల్లో 50 వేల మందికి పైగా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. వైద్యారోగ్యశాఖ రోజూ వెల్లడిస్తున్న కేసులకు అదనంగా ఈ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Fever‌ Survey in hyderabad
Fever‌ Survey in hyderabad

By

Published : May 16, 2021, 5:16 PM IST

కరోనా రెండోదశ విజృంభిస్తోన్న నేపథ్యంలో జ్వర బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం ఫీవర్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైద్య, జీహెచ్ఎంసీ బృందాలు జంట నగరాల్లో ఇంటింటికీ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గత 15 రోజుల్లో గ్రేటర్ పరిధిలో 50 వేల మందికి పైగా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న కేంద్రాలు సహా ప్రైవేటులో నమోదవుతున్న నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ రూపంలో రోజూ వెల్లడిస్తోంది. అందులో వెల్లడైన పాజిటివ్‌ కేసుల సమాచారానికి అదనంగా ఈ 50 వేల మంది బాధితులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే బల్దియా అదనపు బృందాలతో ఫీవర్‌ సర్వేను వేగవంతం చేసింది. మొదటగా 700 జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలతో సర్వే చేయగా.. ఇటీవల ఆ సంఖ్య 1,543 బృందాలకు చేరింది. పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లోనూ సర్వే కొనసాగుతోంది. ఒక్కో బృందంలో ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన సభ్యులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు ఇప్పటి వరకు మొత్తం 6,96,366 మందిని సర్వే చేయగా.. అందులో 19,671 మంది కరోనా లక్షణాలతో ఉన్నట్లుగా గుర్తించారు. 317 బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో 1,97,037 ఫీవర్ సర్వేలు జరగగా.. అందులో 30,991 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. మొత్తం జంట నగరాల పరిధిలో 8,93,403 మందికి ఫీవర్ సర్వే నిర్వహించగా.. అందులో 50,662 మందికి లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. బాధితులందరికీ వెంటనే కరోనా కిట్లను అందించి.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్‌ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫీవర్ సర్వేను కొందరు కరోనా సర్వేగా భావించి ఆందోళన చెందుతున్నారని.. ఇది కేవలం జ్వరం లక్షణాలను పరిశీలించడం కోసమేనని.. అందరూ సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో వేగంగా సాగుతోన్న ఫీవర్ సర్వే

ABOUT THE AUTHOR

...view details