Fake Calls To Dial 100: సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు రోజూ 800-900 ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు 6-7 నిమిషాల వ్యవధిలో చేరుతున్నారు. కొందరు ఆకతాయిలు. మరికొందరు కుటుంబ తగాదాలతో విలువైన పోలీసుల సమయాన్ని వృథా చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో కొందరు ప్రబుద్ధులు చేస్తున్న చేష్టలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏటా డయల్ 100కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో 10శాతం వరకూ కుటుంబ గొడవలు, ఆటపట్టించాలనే ఉద్దేశంతో చేస్తున్నవి ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో తప్పుడు ఫోన్‌కాల్స్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం, మందలించి పంపటమో చేసేవారు. తాజా సంఘటనలో రాచకొండ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
ఎవరి లెక్క వారిదే..
స్మార్ట్‌ఫోన్లు చేతికొచ్చాక.. సామాజిక మాధ్యమాల్లో ఆకతాయిల హల్‌చల్ పెరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పోస్టులను యథాతథంగా ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇవి కొన్ని ఇబ్బందులకు దారితీస్తున్నాయి.
* కుషాయిగూడ పరిధిలో రాజకీయపార్టీ నాయకులు గొడవ పడుతున్నారంటూ వాట్సాప్‌లో రాగానే ఓ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడకెళ్లి పరిశీలించిన పోలీసులు తప్పుడు ప్రచారంగా నిర్ధారించారు.
* శివారు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కుమారుడి సంరక్షణలో ఉంటోంది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై దాడిచేసి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో ఆమెను గట్టిగా మందలించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గొలుసును తానే కుమార్తెకు ఇచ్చినట్టు అంగీకరించింది. విషయం కొడుక్కి తెలిస్తే కోప్పడతాడనే భయంతో అలా చేసినట్టు కన్నీరు పెట్టుకుంది.