హైదరాబాద్ నగరాన్ని మరింత సేఫ్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి నిర్వహించిన పురపాలక, పోలీస్ శాఖల సంయుక్త సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలిస్ కమిషనర్లు, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు.
10 లక్షల సీసీకెమెరాలు...
ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో మొత్తం 10 లక్షల సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన, ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్న నగరం హైదరాబాద్ అని ఒక నివేదిక ప్రస్తావించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
మరింత నిఘా...
శాంతి, భద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఆరేళ్లుగా హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతిభద్రతలను సాఫీగా కొనసాగించే పరిస్థితులను ముఖ్యమంత్రి కల్పించారని తెలిపారు. నగరానికి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు పట్టణీకరణలో భాగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, కూడళ్ల వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని... వీటితో పాటు పార్కులు, చెరువులు, బస్తీ దవాఖానా, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని మంత్రి చెప్పారు.
ప్రతిచోట సీసీకెమెరా...
నగరంలో ప్రజలు గూమికూడే ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా ఉండాల్సిన అవసరం ఉందని... ఆ దిశగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు త్వరలో కొత్త చట్టాలు తీసుకురానున్నట్లు చెప్పారు. ఆ చట్టాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అంశాలను చేర్చాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా పోలీస్ శాఖ నుంచి కేటీఆర్ సమాచారాన్ని తీసుకున్నారు.
సైబర్ వారియర్లు...
హైదరాబాద్లో పెద్దఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసులపై సమావేశంలో చర్చించారు. వాటి నియంత్రణకు ప్రస్తుతం ఉన్న విభాగంతో పాటు సైబర్ వారియర్లను పోలీస్ శాఖ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. కట్టుదిట్టంగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని పోలీసు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే లక్ష్యాన్ని స్వీకరించి ఆ దిశగా కార్యక్రమాలు ప్రణాళికలు కొనసాగిస్తామని చెప్పారు.
సీఎం ప్రోద్భలంతో...
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్భలంతోనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ శాంతిభద్రతలను గట్టిగా నిర్వహిస్తోందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల ద్వారా నేరాల సంఖ్య పెద్దఎత్తున తగ్గిందని... నేరాలు జరిగిన వెంటనే నేరస్థులను అదుపులోకి తీసుకునేందుకు సీసీ కెమెరాల ఫీడ్ చాలా ఉపయుక్తంగా ఉంటోందని అన్నారు. హైదరాబాద్ నగర అవసరాల దృష్ట్యా జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మహమూద్ అలీ అన్నారు.
ఇదీ చూడండి:సానుకూలంగా లేని ఏపీ.. అంతర్రాష్ట్ర జలవివాద చట్టమే శరణ్యం