ప్రయాణికుల బోగీలను రైల్వేశాఖ ఆధునికీకరిస్తోంది. కాలం చెల్లిన ఐసీఎఫ్(ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) బోగీల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్‌మన్ బుష్) బోగీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 18 నాటికి 30 జతల రైళ్లకు పాత ఐసీఎఫ్ బోగీలను తొలగిస్తూ ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఐసీఎఫ్ బోగీల ఉత్పత్తిని రైల్వేశాఖ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఇక కొత్తగా తయారయ్యే బోగీలన్నీ ఎల్‌హెచ్‌బీలే ఉండనున్నాయి.
160 కి.మీ. వేగానికి అవకాశం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్, గోదావరి, దక్షిణ్, చార్మినార్, గుంటూరు ఇంటర్‌సిటీ, విజయవాడ ఇంటర్‌సిటీ, జైపూర్, ఎల్‌టీటీ దురంతో, కాగజ్‌నగర్, రాయలసీమ, నారాయణాద్రి, విశాఖపట్నం డబుల్‌డెక్కర్, ధర్మవరం, గోల్కొండ, కోకనాడ తదితర ఎక్స్‌ప్రెస్‌లను ఎల్‌హెచ్‌బీ బోగీల రైళ్లుగా మార్చింది. మిగిలినవాటికీ కోచ్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని బట్టి దశలవారీగా బోగీలను మార్చనున్నట్లు రైల్వేశాఖవర్గాలు చెబుతున్నాయి. ఎల్‌హెబీ బోగీలు గంటకు గరిష్ఠంగా 140-160 కి.మీ. వరకూ వేగాన్ని తట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో రైల్వేట్రాకులను మరింత బలోపేతం చేస్తే ఈ బోగీలతో రైళ్లు 130 నుంచి 160 కి.మీ. వేగంతో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంటుంది.