- హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన ఒకరు తన మేనల్లుడిని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేర్పించేందుకు వెళ్లారు. మొత్తం రుసుం కాకుండా ఆన్‌లైన్ తరగతులకు రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ రూ.10,500 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. కేవలం పుస్తకాలకు రూ.9 వేలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన వాపోయారు.
- ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ ఇంజినీరు. ఆయన కుమారుడు జేఎన్‌టీయూహెచ్ సమీపంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో బైపీసీ చదువుతున్నాడు. గత ఏడాది రూ.3 లక్షల ఫీజు అని చివరకు రూ.2.25 లక్షలకు అంగీకరించారు.ఈ ఏడాది రూ.3 లక్షలు చెల్లించాలని, రాయితీ గత సంవత్సరానికేనని చెప్పడంతో ఆ తండ్రి అవాక్కయ్యారు. చేసేది లేక ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామంటే రూ.లక్ష చెల్లించారు. పుస్తకాల కోసం రూ.12,500 ఇచ్చారు. మరో రూ.60 వేలైనా చెల్లించకుంటే ఆన్‌లైన్ తరగతులకు అనుమతి ఉండదని ప్రిన్సిపల్ తేల్చి చెప్పారు. ఆయనకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.
ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తున్నామని, మీ పిల్లలే వెనకబడిపోతారని తల్లిదండ్రులను మానసికంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఫీజులు ముందస్తుగా అధికంగా లాగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.80 లక్షల మంది ఇంటర్ మొదటి ఏడాదిలో చేరుతుండగా కార్పొరేట్ కళాశాలల్లో 2.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు.
చేతులు దులిపేసుకున్న ఇంటర్‌బోర్డు