తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో కొవిడ్​ నుంచి కోలుకునే వారి శాతం పెరుగుతోంది!

తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,67,046కు చేరుకోగా.. అందులో 1,35,357 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారి శాతం 81.02 శాతానికి పెరగడం విశేషం. ఈనెల 12న 79.2 శాతం ఉండగా.. వారం రోజుల్లో దాదాపు 2 శాతం పెరిగింది.

mor people are recovered fro m corona virus in telangana
తెలంగాణలో కొవిడ్​ నుంచి కోలుకునే వారి శాతం పెరుగుతోంది!

By

Published : Sep 19, 2020, 7:14 AM IST

రాష్ట్రంలో కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదవగా, మొత్తం బాధితుల సంఖ్య 1,67,046కు పెరిగింది. తాజాగా మరో 1802 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,35,357కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారి శాతం 81.02 శాతానికి పెరగడం విశేషం.

ఈ విషయంలో జాతీయ సగటు 78.84 శాతంగా నమోదైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కొవిడ్‌ బారి నుంచి కోలుకుంటున్నవారు క్రమేణా పెరుగుతున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారు ఈనెల 12న 79.2 శాతం ఉండగా.. వారం రోజుల్లో దాదాపు 2 శాతం పెరిగింది. ఈనెల 17న గురువారం రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది.

తాజాగా మరో 11 మంది కొవిడ్‌ కారణంగా చనిపోగా.. మొత్తంగా మహమ్మారితో మరణాల సంఖ్య 1016కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 314 మంది కొవిడ్‌ బారిన పడగా, రంగారెడ్డి(174), మేడ్చల్‌ మల్కాజిగిరి(144), నల్గొండ(131), సిద్దిపేట(121), కరీంనగర్‌(114), వరంగల్‌ నగర(108) జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్‌(19), జోగులాంబ గద్వాల(17), ములుగు(16), నిర్మల్‌(16), నారాయణపేట(12), జిల్లాల్లో కొత్తగా నమోదైన పాజిటివ్‌ల సంఖ్య 20 లోపే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అంతకంటే ఎక్కువగా నిర్ధారణ అయ్యాయి.

సర్కారు ఐసీయూల్లో 62.46 శాతం

రాష్ట్రంలో గురువారం 50,634 నమూనాలను పరీక్షించగా, ఇందులో ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు 22,279(44శాతం) మంది ఉండగా.. సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 6,076(12శాతం) మంది ఉన్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షలు రాష్ట్రంలో 23,79,950కి పెరిగాయి. మరో 1,039 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కరోనాతో 30,673 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో ఉండి వైద్యసేవలు పొందుతున్నవారు 24,081(78.50శాతం) మంది ఉన్నారు. కేవలం 6,592 మంది మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

చికిత్స అందిస్తూ 382 మంది వైద్యులు మృతి

దేశంలో కొవిడ్‌ రోగులకు వైద్యసేవలు అందించే క్రమంలో వైరస్‌ సోకి 382 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం వీరి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని ఐఎంఏ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. ఐఎంఏ విడుదల చేసిన ప్రకటన మేరకు తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి ముగ్గురు, వరంగల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, మణుగూరు నుంచి ఒక్కో డాక్టర్‌ ఉన్నారు.

ఒక్క గ్రామంలో 47 మందికి పాజిటివ్‌

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మైలారంలో ఒకేరోజు 47 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు స్థానిక ఇబ్రహీంనగర్‌ పీహెచ్‌సీ వైద్యురాలు శామిలి తెలిపారు. గ్రామంలో ఈ నెల 15న సంచార వాహనం ద్వారా 328 మంది నమునాలు సేకరించి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు హైదరాబాద్‌ పంపామన్నారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో 47 మందికి వైరస్‌ సోకినట్లు తేలిందని చెప్పారు. దీంతో వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి కొవిడ్‌ బాధితులకు హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు సమావేశమై శుక్రవారం నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలుకు తీర్మానించారు.

ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'

ABOUT THE AUTHOR

...view details