Delay in Monsoon in 2023 : వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. అవి సముద్రపైన నిలకడగా ఉంటున్నాయి. ఈ కారణంగా అవి కేరళ తీరాన్ని మరో మూడు రోజుల తర్వాతే తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో జూన్ 15వ తేది వరకు వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులను దాడి ప్రస్తుతం బంగాళఖాతంలో కొంత మేరకు ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగిపోయాయి. అరేబియా సముద్రంలో లక్ష దీవులను తాకిన అవి ముందుకు జరగడంలేదు. గత సంవత్సరం జూన్ 1వ తేదీన కేరళాను తాకి వర్షాలు మొదలైనా ఈ సంవత్సరం ఆ తేదీకి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు.
Monsoon to hit Telangana on June 15th :రుతుపవనాల ఆలస్యంతో దేశంలోనికొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల మందగమనానికి ఎల్‌నినో ప్రభావం కొంత కారణం ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘పసిఫిక్ మహా సముద్రంలోని పెరు, ఈక్వెడార్‌ల సముద్ర జలాలు సాధారణం కన్నా ఏడు డిగ్రీలు అదనంగా వేడెక్కి వీచే గాలుల్లో ఒత్తిడి అత్యధికమైంది. ఆ ప్రభావం భారత్ సమీప సముద్ర జలాలపైనా పడుతోంది.
Delay in Monsoon in 2023: ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా ఉంటే కరవు ఏర్పడే అవకాశాలున్నాయి. ఉదాహరణకు దీని ప్రభావంతో ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, భారత్ వంటి దేశాల్లో 1997-98, 2003, 2015 సంవత్సరాల్లో వర్షాలులేక కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు పంటలు పండించే స్థితిలేక తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో కుంభవృష్టి కురిసి పెరూ, అమెరికా వంటి దేశాల్లో అత్యధిక వర్షాలు వచ్చి వరదలు వచ్చాయి. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఎల్‌నినో ప్రభావం పడటం ఆనవాయితీగా మారిందంటూ’’ నిపుణులు పేర్కొంటున్నారు.
గత మూడు సంవత్సరాలుగా భారత దేశంలోకి రుతుపవనాలు నిర్ణీత తేదీల్లో జూన్ 1వ వారంలోనే దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈసారి ప్రవేశానికి ఆలస్యమవుతున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలో రుతుపవనాల విస్తరణతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడాలి. ఈ సంవత్సరం రెండు రాష్ట్రాల్లో ఎండలు ప్రజల్ని ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ పరిస్థితి చెప్పలేకుండా పోయింది. ఇలా జూన్ మొదటి వారం చివరిలో వడగాలులు వీయడం తెలంగాణలో అత్యంత అరుదు.