Monkey Pox: రాష్ట్రంలో మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. అతని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. నెగిటివ్‌గా నిర్థారణ అయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో వైద్యాధికారులు, కువైట్ నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40ఏళ్ల వ్యక్తి ఈనెల 6న కువైట్ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. ఈనెల 23వ తేదీ నాటికి ఒళ్లంతా రాషెస్ రావడంతో మరుసటిరోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. నమూనాలు సేకరించి పూణెలోని ల్యాబ్‌కు పంపించగా నెగిటివ్‌గా తేలింది. కేరళలో రెండు కేసులు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా ప్రకటించారు. ఆసుపత్రిలో 36 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు.