నిజాం హయాంలో కట్టిన ఎన్నో అద్భుత కట్టడాలు... నేటికీ చూపరులన మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. అప్పటి పాలకుల దూర దృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగరంలోని అద్భుత కట్టడాలను... చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన భవనాలను పదిలంగా రాబోవు తరాలకి అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భావిస్తోంది. మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం నగరంలోని పలు కట్టాడాలకు ఇప్పటికే ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగానే నాంపల్లిలోని మోజంజాహి మార్కెట్‌ను ఆధునీకరిస్తున్నారు.
నగరాన్ని కలిపేలా త్రిభుజాకారంలో
హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు 1912లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్.. మోజం బహదూర్ అధ్యక్షతన సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు(సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఆధ్వర్యంలోనే నాంపల్లి రైల్వే స్టేషన్, ఉస్మాన్ గంజ్ మార్గాల కూడలిలో మోజం జాహి మార్కెట్‌ను త్రిభుజాకారంలో నిర్మించారు. పాత బస్తీకి, కొత్త నగరానికి అందుబాటులో ఉండేలా ఈ ఎంజే మార్కెట్‌ను అప్పటి పాలకులు నగరం మధ్యలో ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించారు. చార్మినార్ పరిసర ప్రాంతంలోని మహబూబ్ చౌక్ బజార్, రెసిడెన్సీ బజార్, బేగంబజార్‌లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో 1935లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండో కుమారు నవాబ్ మోజంజా బహదూర్ పేరుతో ఎంజే మార్కెట్‌ను నిర్మించారు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120 దుకాణాల సముదాయంగా దీనిని నిర్మించారు. హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కళాశాల మాదిరిగానే ఎంజే మార్కెట్ నిర్మాణ శైలీ ఉంటుంది.
పాన్లకు అడ్డా..
1947 వరకు ఎంజే మార్కెట్ ప్రముఖ పాన్ బజార్‌గా పేరు పొందింది. ఇక్కడ దొరకని పాన్ వెరైటీలు ఉండవు. క్రమక్రమంగా ఎంజే మార్కెట్ కూరగాయలు, మాంసం, పండ్లు, పూల దుకాణాలు, అత్తరు, స్వీట్, ఐస్ క్రీమ్ షాప్ ఇలా వివిధ రకాల వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 1980లో పండ్ల మార్కెట్ కొత్త పేటకు, 2009లో పూల మార్కెట్ గుడిమల్కాపూర్‌కు తరలివెళ్లాయి. ప్రస్తుతం ఉన్న ఎంజే మార్కెట్ జీహెచ్ఎంసీ నిర్వహణలో ఉంది.
చరిత్ర ఉంది కానీ.. పట్టించుకునే నాథుడేలేరు..