Money Seizures in Telangana During Election Code 2023 : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, హెచ్చరికలు, అధికారుల చర్యలతో శాసనసభ ఎన్నికల వేళ భారీగా నగదు, మద్యం, ఆభరణాలు, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ప్రలోభాలు కట్టడి చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఉన్న ఈసీ.. పదే పదే ఆ విషయమై అధికారులను హెచ్చరించింది. గత అనుభవాల నేపథ్యంలో అధికారుల వ్యవహార శైలి, పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ.. పని చేయకపోతే పని చేయిస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పదే పదే కర్ణాటక, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు.
Telangana Assembly Elections 2023 : ఎన్నికల సందర్భంగా అక్కడ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు పెద్ద మొత్తంలో పెరిగాయని.. తెలంగాణలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులను ఈసీ బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితమైన ఆదేశాలతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తనిఖీలు ప్రారంభించారు. సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నెల తొమ్మిదో తేదీన ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
Police Impose Election Code Strictly in Telangana :భారీ ఎత్తున నోట్ల కట్టలు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుబడుతోంది. స్వాధీనం అయిన సొత్తు మొత్తం ఇప్పటికే గత ఎన్నికలను అధిగమించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.77 కోట్ల 87 లక్షలు. అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం 59,091 లీటర్లు. 18,088 కిలోల నల్ల బెల్లం, 614 కిలోల ఆలం కాగా.. వాటి విలువ రూ.8.99 కోట్లు. రూ.7.55 కోట్ల విలువైన 2,320 కిలోల గంజాయి పట్టుబడింది. సరైన ఆధారాలు, పత్రాలు, వివరాలు లేని 72 కిలోల బంగారు, 429 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.62 కోట్ల 73 లక్షలకు పైగా ఉంది. వీటితో పాటు రూ.8.64 కోట్ల విలువైన ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం మొదలైన వస్తువులు పటుబడ్డాయి.