Moinabad Woman Murder Case Updates :ఈ నెల 8న మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలోని నిర్మానుష్య ప్రదేశంలో మహిళ మృతదేహం కాలిన స్థితిలో ఉండడం స్థానికులు గమనించారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం సమీపంలో సెల్‌ఫోన్, బ్యాగు, ఇతర వస్తువులను క్లూస్ టీం సేకరించింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత మృతురాలి వివరాలు గుర్తించే పనిలోపడ్డారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు చిక్కుల్లో పడ్డారు.
రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులతో పాటు ఇతర ఠాణాల పరిధిల్లోనూ విస్తృతంగా గాలించారు. వందల సీసీటీవీలను పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. దర్యాప్తులో భాగంగా ఎట్టకేలకు ఎనికేపల్లి గ్రామం వద్ద ఆటోలో అనుమానాస్పదంగా ఓ యువతి బ్యాగుతో వెళ్లడం గమనించారు. ఎనికేపల్లి-బాకారం మధ్యలో వెళ్లిన TS 13 UC 1565 నంబర్ గల ఆటో డ్రైవర్‌ను విచారించారు. ఉదయం 8 గంటల సమయంలో మల్లేపల్లి నుంచి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ వరకు రూ.1100 కిరాయితో యువతిని ఎక్కించుకున్నట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు. ఆమె చేతిలో ఓ బ్యాగుతో ఆటో ఎక్కినట్లు వివరించాడు.
మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం- ఇద్దరు పిల్లల ముందే
A Woman Dead Body AT Moinabad Case Updates :మొదట మల్లేపల్లిలోని మురాద్‌నగర్‌లోని స్నేహితురాలి ఇంటికి వెళ్లిందని తెలిపాడు. అనంతరం హుమాయిన్ నగర్‌లో ఉన్న మరో స్నేహితురాలి ఇంటికి వెళ్లి 15 నిమిషాల అనంతరం బయటకు వచ్చి మళ్లీ అదే ఆటోలో ఎనికేపల్లి మీదుగా మొయినాబాద్ చేరుకుందని వెల్లడించాడు. మధ్యాహ్నం 1:38 నిమిషాలకు డ్రీమ్‌వ్యాలీ మెయిన్ గేట్ వద్ద యువతిని దించి వెళ్లిపోయానని ఆటో డ్రైవర్ వెల్లడించాడు.
బాకారం గ్రామ సమీపంలోని సత్యనారాయణ రెడ్డి ఫాంహౌస్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన మృతురాలు తన స్నేహితుడు రాహిల్‌కు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని టవర్ లొకేషన్ ఆధారంగా తేల్చారు. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు చేసిన పోలీసులు, స్నేహితుడు రాహిల్‌ను పిలిచి విచారించారు. అతని ద్వారా మృతురాలి వివరాలు సేకరించారు. ఆమె న్యూ మల్లెపల్లికి చెందిన తహసీన్ బేగం(Tahseen Begum suicide case)గా గుర్తించారు. మదీనా డిగ్రీ కాలేజీలో చదువుతున్నట్లుగా తెలుసుకున్నారు. మృతురాలు, తనతో పాటు చదివే మరో యువతి ప్రాణ స్నేహితులని, కొద్దిరోజులుగా వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని రాహిల్ పోలీసులకు వివరించాడు. ఇద్దరి మధ్య బాగా దూరం పెరిగిందని, ఈ విషయాన్ని తహసీన్ జీర్ణించుకోలేకపోయిందని తెలిపాడు. ఇదే విషయమై గతంలో తన చేతి నరాలను కోసుకుని తహసీన్ ఆత్మహత్యాయత్నం చేసిందని రాహిల్ వివరించాడు.