PM Modi Speech at Warangal Public Meeting : 9 ఏళ్లు పూర్తిచేసుకున్న తెలంగాణ.. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తెలంగాణలో రైల్వే, రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని తెలిపారు. తెలుగువారి ప్రతిభ దేశ సామర్థ్యాన్ని పెంచిందని మోదీ చెప్పారు. కొత్త లక్ష్యాల కోసం మరిన్ని మార్గాలు అన్వేషించాల్సిన అవసరముందన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంలో భాగంగా.. 30 ఏళ్ల తర్వాత ఏకశిలానగరంలో దేశ ప్రధానమంత్రి పర్యటించారు. ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి.. హకీంపేట్ విమానాశ్రయంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ప్రధాని.. మామునూరు ఏరోడ్రమ్‌కు చేరుకున్నారు.
Modi Visited Bhadrakali Temple : అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. మామునూరు నుంచి రోడ్డుమార్గాన భద్రకాళీ ఆలయానికి వెళ్లారు. మోదీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మోదీ గో సేవలో పాల్గొన్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు. పూజల్లో భాగంగా భద్రకాళీ ఆలయం చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ : ఆలయం నుంచి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్న ప్రధాని.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసైతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.