తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలు..! - heavy rains in telangana

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దాదాపు 2 వారాల తర్వాత వరుణుడు పలకరించడంతో.. విత్తనాలు చల్లుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలు..!
రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలు..!

By

Published : Jun 27, 2021, 7:58 PM IST

Updated : Jun 27, 2021, 10:07 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలు..!

దాదాపు 2 వారాల తర్వాత వరుణుడు పలకరించాడు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్​ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల నాలాలు పొంగిపొర్లగా.. మరికొన్ని చోట్ల విద్యుత్​ సరఫరా నిలిపివేశారు.

ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్, ​బోయిన్​పల్లి, మారేడ్​పల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, ఫ్యాట్నీ, బేగంపేటలో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ చార్మినార్, బహదూర్​పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్​పురా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడా, నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మాదిరి వాన కురిసింది. సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, షాపూర్​నగర్​లోనూ జోరుగా వర్షం పడింది.

కోఠి, సుల్తాన్​బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లక్డీకపూల్​, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్​నగర్​, కింగ్ కోఠి, రాంకోటి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్​పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మియాపుర్, చందానగర్, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతాపూర్​ ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా.. పలుచోట్ల విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. కూకట్​పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

మరోవైపు జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది. కరీంనగర్​లో ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఫలితంగా నగరంలోని జ్యోతినగర్ రాంనగర్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులుపడ్డారు. బాలాజీ నగర్​లో మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.

జగిత్యాల జలమయం..

జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మంచినీళ్ల బావి, టవర్ సర్కిల్, మార్కండేయ కాలనీ, నిజామాబాద్ రోడ్​లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పలు డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఖమ్మంలో కుండపోత..

ఖమ్మంలోనూ భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరంలోని కవిరాజ్ నగర్ చెరువు, బజార్ మయూరి కూడలి, సారధి నగర్, మోతి నగర్ ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరంగల్​లోనూ..

వరంగల్‌ జిల్లాలోనూ పలు చోట్ల భారీవర్షం కురిసింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట, మడికొండల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. కుండపోత వర్షానికి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాల్లోనూ ఎడతెరిపి లేని వర్షం పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

నల్గొండనూ నింపేసింది..

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. రామన్నపేటలో అత్యధికంగా.. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో.. ఏకధాటిగా రెండు గంటల పాటు వాన పడింది.

జనంపల్లి, ఇంద్రపాల నగరం, వెల్లంకి గ్రామాల్లో రహదారులపై నీరు చేరి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రామన్నపేట సామాజిక ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం.. జలసంద్రాన్ని తలపించింది. పట్టణంలో ప్రధాన వీధులపై వరద నీరు చేరింది. మోతె మండలంతో పాటు హుజూర్​నగర్, మునుగోడులో పెద్దఎత్తున వర్షం కురిసింది. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామంలో పిడుగుపడి ఓ గేదె మృత్యువాతపడింది.

RAINS: మధురానగర్​ను ముంచెత్తిన వరద.. నీటమునిగిన కాలనీలు

Last Updated : Jun 27, 2021, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details