కరోనా ప్రభావంతో ప్రజల్లో పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఓ వినూత్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించింది. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని జలగం వెంగళరావునగర్‌లోని ఆ శాఖ కమిషనరేట్ ప్రాంగణంలో అద్భుతమైన క్షేత్రం ఆవిష్కరించింది. ఉద్యాన శాఖ సహకారంతో బిందు, తుంపర సేద్యం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమగ్ర కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టింది. పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో టమాట, సొర, బీర, కాకర, గోరుచిక్కుడు, వంగ, బెండ, పచ్చిమిరప వంటి 8 రకాల కూరగాయలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా సహా పలురకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వాటిని అదే ప్రాంగణంలో ఉన్న సేవాసదన్, శిశు విహార్‌లో అనాథ పిల్లలు, వసతి గృహాలకు అందిస్తున్నారు.
వెయ్యిమందికి సరిపోయేలా..
పోషణ్ అభియాన్... జాతీయ పోషకాహార కార్యక్రమం. ప్రజల సంపూర్ణ పోషణ కోసం ప్రధాని మోదీ సూచించిన విస్తృత పథకం. చిన్నారుల్లో సరైన ఎదుగుదల లేకపోవడం, పోషకాహార లేమి, తక్కువ బరువుతో శిశువుల జననం, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ముఖ్యంగా బాలికల్లో రక్తహీనతపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారించడం లక్ష్యం. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ మోడల్ న్యూట్రీ గార్డెన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినట్లు ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య స్వీయ పర్యవేక్షణలో ఈ పోషక క్షేత్రంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఇదే ప్రాంగణంలో సేవాసదన్, దుర్గాభాయి దేశ్‌ముఖ్ విద్యాలయంలోని వెయ్యి మంది విద్యార్థినులకు వండి పెడుతున్నారు. మిగిలినవి అదే శాఖ ఉద్యోగులకు సరఫరా చేస్తున్నారు.
పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో..