తెలంగాణ

telangana

ETV Bharat / state

సంచార శౌచాలయాలు.. ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే! - rtc lady employees phase toilets prolblems

ఆర్టీసీ ఉద్యోగులు విధులుమారే చోట శౌచాలయాలకు వెళ్లాలంటే ఊపిరిబిగపట్టుకోవాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బంది ల్లేకుండా యాజమాన్యం కొత్త ఆలోచన చేసింది. సిబ్బంది కోసం సంచార శౌచాలయాలను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఒక నమూన శౌచాలయాన్ని తయారుచేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ఇవాళ పరిశీలించి ప్రారంభించనున్నారు.

mobile bio toilets for rtc employees in Hyderabad
సంచార శౌచాలయాలు..ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే..​

By

Published : Dec 27, 2019, 5:21 AM IST

Updated : Dec 27, 2019, 7:51 AM IST

సంచార శౌచాలయాలు..ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే..​
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేప్రదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి మహిళా కండక్టర్లు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లే సమయంలో వాళ్లు పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ప్రధానమైంది. గ్రేటర్ పరిధిలో విధులు మారే ప్రదేశాలు రోడ్డుమీదే ఉంటాయి. ఆ ప్రాంతాల్లో శౌచాలయాలు ఏర్పాటు చేయాలంటే కష్టసాధ్యమైంది. అందుకే యాజమాన్యం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది.

సీఎం కేసీఆర్ దృష్టికి

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మహిళా కార్మికులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారేచోట ఛేంజ్ ఓవర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. అవి కేవలం డ్రెస్ ఛేంజ్​ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మలమూత్రాల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం ఆదేశంతో గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంచినీటి సౌకర్యాలు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

పది వరకు సంచార శౌచాలయాలు

శౌచాలయాల కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆయా ప్రాంతాల్లో సంచార శౌచాలయాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 37 వరకు ఛేంజ్ ఓవర్ పాయింట్లు ఉన్నాయి. అందులో డిపో దగ్గర ఉన్నవాటిని వదిలేయగా మరో పది వరకు సంచార శౌచాలయాలు అవసరమవుతాయని అధికారుల అంచనా. ఆర్టీసీకి మియాపూర్​లో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల్లో మార్పులు చేర్పులు చేసి సంచార శౌచాలయాలుగా మార్చాలని నిర్ణయించారు.

అన్నిరకాల వసతులు

ఆయా బస్సుల్లో మహిళా, పురుష ఉద్యోగులకు వేర్వేరుగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేశారు. వాటిలోనే డ్రెస్ ఛేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించే విధంగా ఓ నమూనా సంచార శౌచాలయాన్ని తీర్చిదిద్దారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు, గురుద్వారా, చిలుకలగూడా, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే.. మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

Last Updated : Dec 27, 2019, 7:51 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details