Mobile Lab for cancer screening in women : మహిళల్లో వివిధ క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా వారి వద్దకే వెళ్లి స్క్రీనింగ్ చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ సంస్థ శ్రీకారం చుట్టింది. వివిధ పరీక్షలతోపాటు క్యాన్సర్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటోలజీ(ఎఫ్‌ఎన్‌ఏసీ) పరీక్ష కోసం శరీరం నుంచి నమూనాలు సేకరిస్తారు. దీనినే నీడిల్ బయాప్సీగా వ్యవహరిస్తారు. ఈ నమూనాల ద్వారా క్యాన్సర్ ఉందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. నిర్ధారణ అయితే వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు.
మూడు వందల మందికి పరీక్ష.. 60 మందిలో క్యాన్సర్..మూడు జిల్లాల్లో దాదాపు 300 మంది మహిళలకు రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్లకు సంబంధించి ఎఫ్‌ఎన్‌ఏసీ టెస్టులు చేశారు. 60 మందిలో వివిధ రకాల క్యాన్సర్లు బయట పడ్డాయి. అందరికీ చికిత్స అందిస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఎంఎన్‌జే ఆసుపత్రి తగినంత మంది సిబ్బందితో మొబైల్ ల్యాబ్‌ను సిద్ధం చేసింది. ఈ బృందం గ్రేటర్‌లోని పలు బస్తీల్లో మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించింది. తాజాగా సిద్దిపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పరీక్షలు చేసి అనుమానిత లక్షణాలున్నవారి నుంచి బయాప్సీకి నమూనాలు సేకరించారు. మిగిలిన జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.
35 ఏళ్లు దాటిన మహిళకు ఉచితంగా స్క్రీనింగ్ ..చాలామంది మహిళలు అనారోగ్య సమస్యను చెప్పుకోవటానికి సంకోచిస్తుంటారు. ఆర్థిక, సామాజిక, కుటుంబ కారణాలు ఇందుకు దోహదం చేస్తుంటాయి. దీంతో వ్యాధి ముదురుతున్నా పట్టించుకోరు. మొబైల్ ల్యాబ్ బృందాల వల్ల చాలామంది క్యాన్సర్ పరీక్షలకు ముందుకొచ్చే వీలుంటుంది. దీని ద్వారా 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఉచితంగా స్క్రీనింగ్ చేయనున్నారు.