తెలంగాణ

telangana

ETV Bharat / state

వరుస ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ కాక - దుబ్బాక ఉప ఎన్నికలు

రాష్ట్రంలో వరుస ఎన్నికలతో సందడి నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న జీహెచ్​ఎంసీ ఎన్నికలతో రాజకీయ వేడి మొదలైంది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల స్థానాలకు జరగనున్న మండలి ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో రాష్ట్రంలో సందడి జోరందుకుంది.

mlc, mla by election and ghmc elections in telangana
వరుస ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ కాక

By

Published : Oct 8, 2020, 5:38 AM IST

వివిధ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా కాక మొదలైంది. ముఖ్యనేతలు బరిలో ఉండటంతో అధికార తెరాసతో పాటు కాంగ్రెస్‌, భాజపాలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల స్థానాలకు జరగనున్న మండలి ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో రాష్ట్రంలో సందడి జోరందుకుంది. తెరాస సిటింగ్‌ స్థానాలతో పాటు గతంలో కోల్పోయినవాటిని దక్కించుకునేందుకు ముందుగానే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు కీలకంగా మారింది.

తెరాస కీలకనేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఇక్కడి నుంచి ఎన్నికయ్యేవారి పదవీకాలం 2022 జనవరి 4 వరకూ ఉంటుంది. మార్చి 11న నోటిఫికేషన్‌ వెలువడినా కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నిక వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈనెల తొమ్మిదిన ఎన్నిక జరగనుంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెరాస నుంచి ఎన్నికైన వారే. ఎంఐఎం మద్దతూ పార్టీకి ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు సుభాష్‌రెడ్డి, లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. 9వ తేదీన జరగనున్న ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం దుబ్బాక

సిద్దిపేట జిల్లాలోని సిట్టింగ్‌ స్థానమైన దుబ్బాక సెగ్మెంట్‌ ఉపఎన్నిక తెరాసకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ఇక్కడ తెరాస బరిలో దింపింది. సుమారు నెలరోజులుగా తెరాస ఇక్కడ ప్రచారం చేస్తుండగా.. మంత్రి హరీశ్‌రావు పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారు. తెరాస నుంచి పార్టీలో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా బరిలో దింపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా ప్రచారంలో దిగనున్నారు. భాజపా ముఖ్యనేత రఘునందన్‌రావు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారాన్ని నెల క్రితమే ప్రారంభించారు. ఈ స్థానంలో గెలుపు మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది.

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదులో పోటాపోటీ

2021 ఫిబ్రవరిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస, కాంగ్రెస్‌, భాజపా హోరాహోరీ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. తెజస నేత కోదండరాం బరిలో దిగనుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఓటర్లుగా గ్రాడ్యుయేట్‌ల నమోదును అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రారంభించాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి భాజపా నేత రామచందర్‌రావు... నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి తెరాస ముఖ్యనేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు పలువురు ఈసారి బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.

పార్టీలకు గ్రేటర్‌ సవాల్‌

శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరంగా ఇప్పటికే సందడి మొదలైంది. ప్రస్తుత పాలకవర్గానికి 2021 ఫిబ్రవరి 10తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే కసరత్తు ప్రారంభించింది. 24 శాసనసభ నియోజకవర్గాల పరిధి కలిగిన జీహెచ్‌ఎంసీలో పట్టును కొనసాగించేందుకు తెరాస కార్యాచరణ ప్రారంభించింది. దీనిపై పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల కోసం కమిటీల ఏర్పాటుతో పాటు వివిధ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. భాజపా కూడా అంతర్గత కసరత్తు ఆరంభించింది. ఎంఐఎం గతంలో నెగ్గిన డివిజన్లతో పాటు కొత్తగా మరి కొన్నింటిపై సమీకరణలు మొదలుపెట్టింది.

ఇదీ చదవండి:సాదాసీదాగా తుంగభద్ర పుష్కరాలు!

ABOUT THE AUTHOR

...view details