MLC Kavitha : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తిరుమలలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న ఆమెకు... అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అలిపిరిలోని శ్రీవారిపాదాల మండపం, సప్త గో ప్రదక్షిణశాల, శ్రీలక్షీ నారాయణ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్త గో ప్రదక్షిణశాల వద్ద మొక్క నాటారు.
దేశానికి సంబంధించి సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాల్సిన అవసరముందని... ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. చర్చ జరిగినప్పుడే అనేక అంశాలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్న కవిత... 105 స్థానాల్లో డిపాజిట్ రాని భాజపా తెరాసపై దుష్ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. కాలినడకన తిరుమల చేరుకున్న కవిత... రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు.