MLC Kavitha on Hijab Issue: నుదుటన సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు... హిజాబ్ ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛే అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలనేది మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని సూచించారు. మహిళలు సృష్టికర్తలన్న కవిత... వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని గుర్తుచేశారు. ఈ సందర్బంగా తనురాసిన కవితను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత రాసిన కవిత అర్థమిది...
హిందూ - ముస్లిం - సిక్కు - క్రిస్టియన్.. మతమేదైనా... అంతా భారతీయులమే...
సిందూర్ - టర్బన్ - హిజాబ్ - క్రాస్... ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే...
త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
జై హింద్ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
జన గణ మనతో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే... మనం ఎవరైనా... మనమంతా భారతీయులమే..
'' మహిళలు హిజాబ్ ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛ కిందకే వస్తుంది. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలనేది మహిళలకే వదిలేయాలి. మహిళలకు సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. '' - ఎమ్మెల్సీ కవిత
what is hijab controversy
అసలేంటీ హిజాబ్ వివాదం...
కర్ణాటకలో హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను గేటు వద్దే అడ్డుకున్న ఘటనలు ఇటీవల సంచలనం సృష్టించాయి. ఉడిపిలోని కుందాపూర్‌లోని ఓ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. విద్యార్థినులు కళాశాల గేటు వద్దే అడ్డుకున్న సిబ్బంది.. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్‌కోడ్ ప్రకారం హిజాబ్‌లు ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి:హిజాబ్ వివాదం- కాషాయ శాలువాలకు అనుమతివ్వాలని ఆందోళన