MLC Kavitha Tweet on Sukesh : సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఫేక్ చాట్లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగానే పని కట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి సుమారు రూ.75 కోట్లు ఇచ్చానని చెప్పిన.. ఆర్థిక నేరగాడు సుఖేశ్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని వివరణ ఇచ్చారు. సుఖేశ్‌తో కవితకు సంబంధాలున్నాయని కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేశాయని మండిపడ్డారు. ఇది వరకు తన మొబైల్ ఫోన్ విషయంలో కూడా అదే పనిగా తప్పుడు వార్తలు రాశారన్నారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేశ్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను, వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి అసత్యపు ప్రచారాలకు బీజేపీ పూనుకుంటుందని కవిత ట్వీట్ చేశారు. ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖను రాస్తే.. అది పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి రాద్దాంతం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో బురద జల్లే కార్యక్రమానికి పూనుకొని.. ఒక ప్రణాళిక ప్రకారం దానినే అమలు చేస్తున్నారన్నారు. ఆ పార్టీ ఆడుతున్న ఆటలు అందరికీ తెలుసని.. ఈ విషయాలను అందరూ గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.