MLC Kavitha Respond on Revanth Reddy Tweet : గ్రూప్-2 అభ్యర్థిని ప్రవల్లిక ఆత్మహత్యపై రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై.. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి.. రాజకీయం చేయడం మీ విధానమా? అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ చేస్తాం.. బాధను కూడా పంచుకుంటాం అంటూ కవిత రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం.. ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమంటూ విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల నిర్వహణకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు.
MLC Kavitha Comments on Revanthreddy :తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా.. దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా ? అని ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నించారు. చివరికి గ్రూప్-2ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా.. మీరు కూడా ట్విటర్(X)లో డిమాండ్ చేసింది వాస్తవం కాదా అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అంటూ ఘాటుగా బదులిచ్చారు. ప్రవల్లిక ఆత్మహత్యపై మీ ఆవేదన బూటకం.. మీ ఆందోళన నాటకమంటూ ధ్వజమెత్తారు.