Mlc kavitha on ambedkar statue: ‘రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని చట్టసభల ఆవరణలో ఏర్పాటు చేయాలంటూ మూడేళ్లపాటు చేసిన ఉద్యమం... తత్ఫలితంగా అది సాకారం కావడంతో నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను’ అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ‘శాసనసభ ఆవరణలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహ సాధన ఉద్యమానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె శుక్రవారం ‘ఈనాడు- ఈటీవీ భారత్’తో మాట్లాడారు. ‘చట్టసభల ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలుత వినతిపత్రాలు సమర్పించాను. ప్రభుత్వం స్పందించలేదు. శాసనసభ ముట్టడికి యత్నించాం. అలా మూడేళ్లపాటు వివిధ మార్గాల్లో పోరాడాం. చివరికి ఇందిరా పార్కు వేదికగా 2012 ఏప్రిల్ 13 నుంచి 15వ తేదీ వరకు దీక్ష చేపట్టాను. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి.
ఆయన విగ్రహం అక్కడే ఉండాలని:దేశంలో సామాజిక అసమానతలను రూపుమాపి సమానత్వ పాఠాలు నేర్పిన మహోపాధ్యాయుడు అంబేడ్కర్. తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్క. రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభ ఆమోదం అవసరం లేకుండా పార్లమెంటులో చట్టం చేయవచ్చని రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన అంశమే ఆనాడు తెలంగాణ ఉద్యమానికి దారిచూపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అందుకే ఆయన విగ్రహం రాష్ట్రంలో చట్టాలుచేసే శాసనసభలో ఉండడం సముచితమని గట్టిగా విశ్వసించాను. ఇందుకోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టాం. వివిధ రాజకీయపార్టీల అధ్యక్షులను, శాసనసభాపక్ష నేతలను, జాతీయ నాయకులను, అంబేడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేసిన అనేకమంది పెద్దలను కలిశాను.’
ముమ్మరంగా ఉద్యమించాం:లక్ష్యం మంచిదే అయినా, చాలామంది సంఘీభావం ప్రకటించినా ముందుకెళ్లేకొద్దీ ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అందుకే విజ్ఞాపనలు, సంప్రదింపులతో పాటు ఉద్యమ కార్యాచరణ చేపట్టాం. వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 48 గంటల నిరాహార దీక్ష, శాసనసభ ముట్టడికి పిలుపు వంటివి చేయాల్సి వచ్చింది. వివిధ సందర్భాల్లో అరెస్టయ్యాను. ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో అప్పటి ప్రభుత్వం విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడ[ం ఆనందాన్ని కలిగించింది. ఉద్యమంలో నేను ముందున్నా... ఎంతోమంది ప్రజాస్వామికవాదులు, అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్న ఆలోచనాపరులు, సంస్థలు, సంఘాల ఆకాంక్ష అది. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరం స్వాగతించాం. ఎట్టకేలకు 15 అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు కావడంతో మహత్తర లక్ష్యం సాకారమైంది’ అంటూ వివరించారు కవిత.