MLC Kavitha on Adilabad CCI: 'ఆదిలాబాద్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలోని బొగ్గు గనుల అమ్మకాలతో వచ్చిన సొమ్మును రాష్ట్రం కోసం వినియోగిస్తారా' అని అడిగే దమ్ము రాష్ట్ర భాజపా నాయకులకు ఉందా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసి కోరారని... మంత్రి కేటీఆర్ పలు మార్లు ఉత్తరాలు రాశారని కవిత గుర్తు చేశారు. అనేక కుటుంబాలు ఆధారపడిన పరిశ్రమలను మూసివేసి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కవిత ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనకున్న అర్థమేమిటని ప్రశ్నించారు.
సిమెంటు ఫ్యాక్టరీ మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న భాజపాను అడుగడుగునా ప్రశ్నించాలని కవిత సూచించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం... వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఏం చేయబోతున్నారో సమాధానం చెప్పాలని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లను డిమాండ్ చేశారు. సీసీఐ మూసివేతతో ఆ పరిశ్రమపై ఆధారపడిన 3000 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'కేంద్రంలోని భాజపా ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు అమ్ముతోంది. ఆ వచ్చిన డబ్బుతో ఏం చేస్తారో భాజపా నాయకులు సమాధానం చెప్పాలి. ఆ నిధులతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమ పెట్టబోతున్నారా.. లేక కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయబోతున్నారా.? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా.?. సీసీఐ మూసివేతతో వేలాది కుటుంబాలకు ఉపాధి కరవై రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. పునరుద్ధరణ దిశగా కేంద్రంపై భాజపా నాయకులు ఒత్తిడి తీసుకురావాలి' -కవిత, ఎమ్మెల్సీ