MLC Kavitha on ED Investigation: దిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) విచారణకు నేడు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈడీ నోటీసులపై న్యాయవాదులతో చర్చించిన కవిత.. తాను ఈ నెల 11న విచారణకు హాజరుకాగలనని ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఈనెల 9న దిల్లీలోని కార్యాలయానికి రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 11న విచారణకు హాజరవుతాను: ఐతే ముందస్తు కార్యక్రమాల వల్ల ఆ రోజు విచారణకు హాజరుకాలేనని ఈ నెల 11 రాగలనని కవిత లేఖలో పేర్కొన్నారు. ఇంత స్వల్పకాలంలో విచారణకు రావాలని కోరడమేమిటని లేఖలో ప్రశ్నించారు. గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా.. నేరుగా ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత రాసిన లేఖపై ఈడీ స్పందించాల్సి ఉంది.
MLC Kavitha Letter to ED: ఈడీ నోటీసులకు సంబంధించి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ ఎప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారుకి తలవంచేది లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ని లొంగ దీసుకోవడం సాధ్యం కాదన్నారు. రాజకీయ రంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు.