తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేవరకు పోరాడుతాం: కవిత - MLC Kavitha latest news

MLC Kavitha Deeksha Ended at Jantar Mantar: మహిళా రిజర్వేషన్లు సాధించేవరకు పోరుబాట విడిచేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో.. భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద కవిత నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. సంపూర్ణ ఆధిక్యం ఉన్న కేంద్రంలోని భాజపా సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే బిల్లు ప్రవేశపెట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Kavitha
Kavitha

By

Published : Mar 10, 2023, 5:36 PM IST

Updated : Mar 11, 2023, 6:31 AM IST

మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేవరకు పోరాడుతాం: కవిత

MLC Kavitha Deeksha Ended at Jantar Mantar: మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో, భారత్‌ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. భారత్‌ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. దీక్షలో భారాస ఎంపీలు సహా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. సీపీఐ సీనియర్‌ నేత నారాయణ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. మహిళా రిజర్వేషన్లు అనేది కవితకు సంబంధించి అంశం కాదని... దేశంలోని సగం జనాభాకు సంబంధించినదని తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రారంభమైన ఏ ఉద్యమమైనా గమ్యస్థానానికి చేరిందని.. ఇదేవిధంగా మహిళా రిజర్వేషన్ల పోరాటం కూడా లక్ష్యాన్ని చేరుకుంటుందని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు.

'మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చేవరకూ పోరాట మార్గాన్ని విడిచే ప్రసక్తేలేదని దేశంలోని సోదరీమణులకు హామీ ఇస్తున్నాను. ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం. మహిళా రిజర్వేషన్లతోనే భారత్‌ బలోపేతం అవుతుంది. దేశ ప్రజాస్వామ్యం శక్తిమంతం అవుతుంది. సంపూర్ణ ఆధిక్యం ఉన్న బీజేపీ సర్కార్‌కు ఇది ఓ చారిత్రక అవకాశం. మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. బిల్లు పెడితే అన్ని పక్షాలకు ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. దేశంలోని మహిళలందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేస్తాం. పార్లమెంటులోనూ మద్దతు కూడగట్టేందుకు చూస్తాం. ఇది ఆరంభం మాత్రమే. దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తాం. మహిళా రిజర్వేషన్లు బిల్లు వచ్చేవరకు వెనకడుగు వేసేది లేదు.'-కవిత, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ

ప్రధాని మోదీ పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఆర్​ఎస్​ఎస్ అజెండాను అమలుచేస్తున్నారని... ఇందులో మహిళలకు హక్కులు ఇచ్చేందుకు ఇష్టపడరని తెలిపారు. అందుకోసమే మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తోందని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ విమర్శించారు.

'ప్రధానిగా తొలిసారి ఎన్నికైన తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టిన మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లు మా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని చెప్పారు. 9ఏళ్లు పూర్తైనా బిల్లు ఇప్పటికీ రాలేదు. కనీసం బిల్లు ప్రవేశపెట్టలేదు. మా పార్టీ(‌‌ సీపీఎం), భారాస, కవిత కలిసికట్టుగా ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ఒత్తిడి తీసుకువస్తాం. ఈ అంశంపై చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. బిల్లు ఆమోదం పొందేవరకు మీతో కలిసి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం.'-సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి

'జీ-20 కూటమికి భారత్‌ నేతృత్వం వహించడం గర్వకారణం. కానీ దురదృష్టవశాత్తు కూటమికి ప్రధాని మోదీ ఛైర్మన్‌. జీ-20లో మహిళా సాధికారత అనేది కూడా అజెండా. ఆయనకు(ప్రధాని) చిత్తశుద్ధి ఉంటే జీ-20 ఛైర్మన్‌ పదవికి న్యాయం చేయాలనుకుంటే.. పార్లమెంటులో 33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలి. బిల్లు ఆమోదం పొందకుండా జీ-20కి ఛైర్మన్‌గా ఉండేందుకు అర్హులు కారు. దీనిని నిర్వహించే నైతికహక్కు కూడా లేదు. బిల్లును ఆమోదించండి లేదా ప్రభుత్వం నుంచి వైదొలగండి. 'మోదీ హఠావో లేదా బిల్లుకు ఆమోదం తెలపండి' ఇదే మా నినాదం.'- నారాయణ, సీపీఐ సీనియర్‌ నేత

మోదీ సర్కార్‌ మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టకుంటే మహిళా ద్రోహిగా మిగిలిపోతారని భారాస మంత్రులు, ఎంపీలు విమర్శించారు. పార్లమెంటులో పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు నేతలు సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతి, ప్రధానికి పంపుతామని కవిత ప్రకటించారు. అనంతరం భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు.. కవితకు పళ్లరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 11, 2023, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details