MLC kavitha comments on bjp: దేశంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. మహిళలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేస్తున్నారని కవిత ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. బతుకమ్మను కూడా బండి సంజయ్ అవమానించారన్నారు.
యాగాలు చేయడం కేసీఆర్‌కు కొత్త కాదు..‘‘భారత్ రాష్ట్ర సమితి ప్రకటనతో భాజపా బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్ నన్ను అవహేళన చేశారు. పశ్చిమ్‌బెంగాల్ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. యాగాలు చేయడం సీఎం కేసీఆర్‌కు కొత్త కాదు. భారాసకు దైవశక్తి అవసరం కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా పార్టీలోకి చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో భాజపాకు భారాస ప్రత్యామ్నాయం కాబోతోంది. భాజపా వ్యతిరేక కూటములను ఏకం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలను ఖరారు చేస్తాం.