MLC Jeevan Reddy on Kaleshwaram Project Corruption : కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలో నిజమైన తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనసమైఖ్యాంధ్ర పాలన కంటే అధ్వాన్నంగా ఉండేదని ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల(Appointments) పేరిట ఉద్యమించి సంపాదించుకున్న రాష్ట్రం, గత దశాబ్దం కాలంలో ఆ లక్ష్యాలను సాధించే దిశగా పాలన జరగలేదని ఆక్షేపించారు.
సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్ రెడ్డి
ఇంతకాలం కొనసాగిన నియంతృత్వ పాలనకు, ప్రజలు కోరుకున్న మార్పే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పుల వాటా రూ.అరవై వేల కోట్లు ఉంటే నేడు కేసీఆర్ కమిషన్ల కక్కుర్తికి రూ.6 లక్షల కోట్లు దాటిందని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట రూ. 38 వేల కోట్లకు జరగాల్సిన చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్ట్‌కు కోటి ఇరవై లక్షల రూపాయల వరకు ఆర్ధిక భారం పడేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్(CWC) అనుమతి కూడా లేకున్నా నిర్మాణం చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడినప్పటికీ, వర్చువల్‌గా ఉమ్మడి రాష్ట్రం కంటే పాలన ఘోరంగా కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే అసలు మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా అని బాధ కలిగింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగి పోవటంతో, కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే దానిని మరల పరిశీలించి, ఆ కుంగి పోవటానికి గల కారణం సాంకేతిక లోపం, నిర్మాణ లోపమని వారు చెప్పటం జరిగింది. అదే విధంగా నివేదిక సమర్పించడంతో పాటు అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి కూడా లేదని పేర్కొనటం జరిగింది. -టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ