తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

MLAs Poaching Case Latest Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టవిరుద్ధమైన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఏసీబీ కోర్టు తీర్పుతో.. కీలక కేసుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని చెప్పారు. మరోవైపు ఇలాంటి మెమోను ఇప్పటివరకూ చూడలేదని ప్రతిపాదిత నిందితుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

MLAs Poaching Case Latest Update
MLAs Poaching Case Latest Update

By

Published : Dec 9, 2022, 7:43 AM IST

MLAs Poaching Case Latest Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ వెల్లాపల్లి, జగ్గుస్వామి, భూసారపు శ్రీనివాస్‌లను కేసులో నిందితులుగా చేర్చడానికి ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ డి.నాగార్జున్‌ సుదీర్ఘ వాదనలు విన్నారు. తీర్పును శుక్రవారం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

అంతకుముందు సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ‘‘మెమోతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి సమాచారమో తీసుకుని కేసు వర్తించదన్నట్లుగా ఉత్తర్వులు ఇవ్వడం చట్టంపై అవగాహన లేకపోవడమే. ఇలాంటిచోట సీఐడీ కేసులతో పాటు ఏసీబీ వద్ద ఉన్న కీలకమైన కేసుల భవిష్యత్తుపై ఆందోళనకరంగా ఉంది. నిందితుల మధ్య కుట్రకు సంబంధించి ఒకే ఉద్దేశం లేదని, ముడుపులు ఇచ్చినట్లుగా, ప్రలోభపెట్టినట్లుగా ఆధారాల్లేవని, అక్కడ డబ్బు లేదని, అందువల్ల దర్యాప్తు సంస్థ పెట్టిన సెక్షన్‌లు వర్తించవని కింది కోర్టు ఎలా చెప్పగలదు? మెమోపై ఉత్తర్వుల జారీలో అసలు విషయాన్ని వదిలి ఎక్కడికో వెళ్లారు. రామచంద్రభారతి నుంచి సంతోష్‌కు మెసేజ్‌ వెళ్లినట్లు స్క్రీన్‌షాట్‌లు ఉండగా సంతోష్‌ నుంచి మెసేజ్‌ లేదని ఏసీబీ కోర్టు ఎలా చెబుతుంది? హరిద్వార్‌లో వారు కలిసి ఉన్న ఫొటో ఉంది. తిరుపతిలో వారు కలిసి ఓ యజ్ఞంలో పాల్గొన్నారు. రోహిత్‌రెడ్డి నుంచి తప్ప మిగిలిన ఎమ్మెల్యేల 161 స్టేట్‌మెంట్‌లు లేవన్న ఏసీబీ కోర్టు అభ్యంతరం అర్థంపర్థంలేకుండా ఉంది. ఇలాంటి అధికారిపై పరిపాలనపరంగా చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేసే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు పోలీసులు సమర్థులుకారని పేర్కొన్నప్పుడు గతంలో నిందితులను ఎలా రిమాండ్‌కు పంపారు? అభియోగాలు నమోదు చేశాక మేజిస్ట్రేట్‌ కారణాలు నమోదు చేయాలిగానీ, పూర్తిగా సాక్ష్యాలు సమర్పించకముందే దర్యాప్తును నీరుగార్చేలా కేసును కొట్టివేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. హైకోర్టు కూడా దర్యాప్తును నిలిపివేయడానికి ప్రయత్నించదు. ఇలాంటి అధికారాన్ని అరుదుగా వినియోగిస్తుంది. చట్టవిరుద్ధమైన ఉత్తర్వులను కొనసాగించడానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు.

నిందితులుగా చేర్చడానికి వింత పద్ధతి:మెమో ద్వారా నిందితులుగా చేర్చడమే వింతగా ఉందని బి.శ్రీనివాస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రామచంద్రరావు తెలిపారు. మెమోకు ఉన్న చట్టబద్ధతనే ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారని, ఇలాంటి మెమోను ఆమోదించరాదని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రతిపాదిత నిందితులు తమకు జారీ చేసిన 41ఎ నోటీసులను సవాలు చేశారని, పలువురు వాటి అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారన్నారు. ఈ సమయంలో మెమో ద్వారా వారిని నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఏముందన్నారు.

ఏదో ఒక సమాధానంలేని మెసేజ్‌, ఏదో ఒక ఫొటో ఆధారంగా నిందితులుగా చేర్చడం సరికాదన్నారు. నా క్లయింట్‌ ఆసుపత్రిలో ఉన్నానని, విచారణకు గడువు కోరితే సహకరించడంలేదంటూ నిందితుడిగా చేర్చారన్నారు. ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్టు లేదంటే అభియోగ పత్రంలో నిందితులుగా పేర్కొంటారని, ఇక్కడ మెమో ద్వారా ఎందుకు అడుగుతున్నారన్నారు. సిట్‌లో ఐపీఎస్‌లు ఎక్కువై కేసు దర్యాప్తును చట్టవిరుద్ధంగా తీసుకెళుతున్నారని, అందుకే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నామన్నారు. ‘‘సీఎం విలేకరుల సమావేశం పెట్టారు. వీడియోలు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ ముడుపులు ఎవరు తీసుకున్నారు? అక్కడ పంపిణీ చేసిన డబ్బు ఎక్కడ ఉంది? ఇవి లేనప్పుడు పోలీసులు నమోదు చేసిన సెక్షన్‌లు వర్తించవు. ఈ ఉత్తర్వులను పక్కన పెడితే ప్రాథమికంగా తాము నేరానికి పాల్పడినట్లవుతుంది. ఎలాంటి తీర్పు లేకుండా నేరస్తుడిని అవుతాం’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అందులోనూ ఇవి ఓ కేసులో మధ్యంతర ఉత్తర్వులని వాటిపై రివిజన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. సిట్‌ మెమో దాఖలు చేయడం ద్వారా ఉత్తర్వులను ఆహ్వానించిందన్నారు.

మరో సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ ఇలా ప్రాసిక్యూషన్‌ మెమో దాఖలు చేయడం తాను ఇంతవరకు చూడలేదన్నారు. నిందితులుగా చేర్చడానికి ఇదో కొత్త పద్ధతి ఉన్నట్లుందన్నారు. కేసు రుజువు చేస్తారో లేదోగానీ ప్రస్తుతం అరెస్ట్‌ చేయించడంలో మాత్రం దర్యాప్తు సంస్థలు విజయవంతమయ్యేందుకు అవకాశం ఉందన్నారు. వాట్సప్‌ మెసేజ్‌లను సాక్ష్యాలుగా పేర్కొన్నప్పుడు దానికి సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉందన్నారు. నిందితులతో కలిసి గ్రూప్‌ కాల్‌ ద్వారా మాట్లాడారంటూ కొంతమంది పెద్దవారిని కేసులోకి లాగడానికి కొన్ని ఎంపిక చేసిన మెసేజ్‌లను చూపుతున్నారన్నారు. ఇది అధికార దుర్వినియోగమేనన్నారు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై 80 కేసులున్నాయని, అందులో ఎన్నికల నేరాలు కూడా ఉండగా ఆయన ఇప్పుడు ఎన్నికల నేరాల గురించి ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details