గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి MLA Vamsi followers attack on TDP office: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దుశ్చర్యలతో గన్నవరం భగ్గుమంది. టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించారు. కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ చర్యతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యక్తిగత విమర్శలు.. గన్నవరంలో నిప్పురాజేశాయి.
రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు వంశీపై విమర్శలు గుప్పించారు. అయితే తమ నాయకుడినే విమర్శిస్తారా అంటూ.. వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నాకు ఫోన్‌లో అసభ్య పదజాలతో ఎమ్మెల్యే అనుచరులమంటూ బెదిరింపులకు దిగారు.
ఉదయం నుంచి పలు నంబర్లతో చిన్నాకు బెదిరింపులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఈ సాయంత్రం వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో విధ్వసం సృష్టించారు. కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. మంటల్లో కారులోని ఇంధన ట్యాంక్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వైసీపీ శ్రేణుల విధ్వసంతో ఈ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ వర్గీయుల రాళ్లదాడిలో సీఐ సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్ద దాడి ఘటన నేపథ్యంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి ఇరువైపులా టీడీపీ, వైసీపీ శ్రేణులు మోహరించాయి. అప్సర థియేటర్ సమీపంలో ఇరువర్గాలు వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో హైవేపై మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ 3కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇవీ చదవండి: