'రేవంత్ నియామకంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చింది' రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పటిష్ఠం కాబోతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించిందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నియామకంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చిందని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో మల్కాజిగిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సీతక్క.. ఆయనను గజమాలతో సన్మానించారు.
వేల సంఖ్యలో అభిమానులను చూస్తుంటే నిజంగా పండగ వాతావరణంలా అనిపిస్తుందని సీతక్క పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డికి భారీ ప్రణాళికే ఉందని తెలిపారు. రేవంత్ కార్యకర్తల్లో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడమే ఆయన ముందున్న లక్ష్యమన్న సీతక్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
అధికారంలోకి రావడం కష్టమేమీ కాదు..
కార్యకర్తలు, జిల్లా స్థాయి నేతలు అందరి అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ విషయంలో అధిష్ఠానం తప్పు చేసిందనే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుని ఎన్నిక అనేది ఒక్కరోజులో జరిగింది కాదు. ఒక్కొక్కరిగా నేతలందరి అభిప్రాయం తెలుసుకుని.. ఆరు నెలల సమయం తీసుకుని అధ్యక్షుడిని ప్రకటించారు. ఈ విషయంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. ఆ నాయకత్వమంతా ఏకతాటిపై పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి.. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి కానుకగా ఇవ్వాలి. గ్రామగ్రామానా తిరిగి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడతాం. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని పెంచుతాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశించిన విధంగా మేమంతా కష్టపడి పనిచేస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ఇందుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలి.
-సీతక్క ములుగు ఎమ్మెల్యే
ఇదీ చూడండి: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు?