Congress vari deeksha: హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపడుతున్న వరి దీక్షలో.. రైతులకు మద్దతుగా 9 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి తీర్మానాలను దీక్షలో ప్రవేశపెట్టారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. ప్రస్తుత ఖరీఫ్ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేతలు తీర్మానించారు. కల్తీ విత్తనాల బారి నుంచి రైతులను కాపాడాలని.. పంట రుణ మాఫీ చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోళ్లు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.
కిసాన్ కాంగ్రెస్ ఆమోదించిన 9 తీర్మానాలు
- ప్రస్తుత ఖరీఫ్ వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
- తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి.
- ధాన్యం కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.
- గతేడాది రబీ పంట సేకరణలో జరిగిన అవకతవకల వల్ల రైతుకు భారీగా జరిగిన ఆర్థిక నష్టాల మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి.
- యాసంగి పంటల సాగు విషయంలో ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలి.
- మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.
- వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్ట బద్ధత కల్పించాలి.
- సమగ్రమైన విత్తన చట్టాన్ని తెచ్చి కల్తీ విత్తనాల బారి నుంచి రైతును కాపాడాలి.
- ఏకకాలంలో రూ. లక్ష పంట రుణమాఫీ చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020, 21 సంవత్సరాలకు కోర్టు ఆదేశాల ప్రకారం పంట నష్ట పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలి.
కమీషన్ల కోసమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతులను వరి పండించవద్దంటున్నాయని..కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పండే ప్రాంతాల్లో ఇతర పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో వందల మంది అన్నదాతలు చనిపోయినా.. చివరికి గెలిచింది రైతులేనని సీతక్క(Mulugu mla seethakka in vari deeksha) అన్నారు. రైతుల పోరాటానికి సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా మద్దతివ్వలేదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు, కమీషన్ల కోసమే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులను గురిచేస్తున్నాయని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Paddy Procurement in telangana: యాసంగికే కాదు.. వానాకాలం పంటకూ తంటాలు!